Sunday, January 19, 2025

ఎన్నికలకు కాంగ్రెస్ రేస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ జరిగింది. మాజీ ప్రధాని, కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలోనే ఆదివారం సిడబ్లుసి జాబితా వెల్లడించారు. ఈ క్రమంలోనే సరికొత్తగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మొత్తం 84 మందితో ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖ నేతలకు స్థానం దక్కింది. సార్వత్రిక ఎన్నికలు , అంతకు ముందు దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే దశలో వర్కింగ్ కమిటీ పునర్వస్థీకరణ పార్టీలో అత్యంత కీలకమైన సంస్థాగత మార్పుగా నిలిచింది. మొత్తం 84 మంది సభ్యుల జాబితాలో 39 మందిని వర్కింగ్ కమిటి జనరల్ సభ్యులుగా తీసుకున్నారు. 18 మందిని సిడబ్లుసి శాశ్వత ఆహ్వానితులుగా , తొమ్మండుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా,

నలుగురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా తీసుకున్నారు, కాంగ్రెస్‌లో అసమ్మతివర్గంగా పేరొందిన జి 23 నేతలైన శశిథరూర్, ఆనంద్ శర్మ , ముకుల్ వాస్నిక్‌వంటి వారికి కూడా స్థానం దక్కింది. ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సచిన్ పైలట్‌ను సిడబ్లుసిలోకి తీసుకున్నారు. దీపాదాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్‌లకు కూడా కమిటీలో చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితులుగా తెలుగువారు అయిన టి సబ్బరామిరెడ్డి, కె రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డి ఎంపిక అయ్యారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి వర్కింగ్ కమిటీ జనరల్ సభ్యుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి చోటు దక్కింది. ఈ విధంగా సభ్యులుగా అవకాశం దక్కించుకున్న తెలుగు వ్యక్తి కేవలం రఘువీరారెడి నిలిచారు. గత ఏడాది పార్టీ అధ్యక్షులుగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు తీసుకున్న తరువాత వర్కింగ్ కమిటీ స్థానంలో తాత్కాలికంగా 47 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వర్కింగ్ కమిటీ పునర్వస్థీకరణ జరిగింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది ప్రముఖులు
ఇప్పుడు వెలువడ్డ తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. వీరిలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి, అంబికా సోనీ, మీరాకుమార్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, ప్రియాంక గాంధీ, తారీఖు అన్వర్, లాల్‌థన్‌వాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్‌రావు చవాన్, అజయ్ మకెన్, చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, కుమారీ సెల్జా, గైకంగమ్, ఎన్ రఘువీరా రెడ్డి, శశిథరూర్ , తమర్థ్‌వాజ్ సాహూ, అభిషేక్ మనూ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్ , సల్మాన్ ఖుర్షీద్, జితేంద్ర సింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా , సచిన్ పైలట్, దీపక్ బబారియాలు సభ్యులుగా నియమితులు అయ్యారు.

యువతకు స్థానం చిత్రణ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్వస్థీకరణలో ఇంతకు ముందటి పద్థతికి విరుద్ధంగా ఈసారి 50 ఏండ్ల లోపు వారికి ఎక్కువగా స్థానం కల్పించారు. బలహీనవర్గాలకు, 15 మంది మహిళలకు అవకాశం దక్కింది. ఎన్‌ఎస్‌యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా తీసుకున్నారు. ఇంతకు ముందు సోనియాకు వ్యతిరేకంగా లేఖలు రాసి అసమ్మతినేతల బృందంలో చేరిన ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, థరూర్‌లకు కీలక స్థానాలు కల్పించారు. కాగా ఈ బృందంతో వెళ్లిన మనీష్ తివారీ, వీరప్ప మొయిలీలకు శాశ్వత ఆహ్వానితుల స్థానం దక్కింది. శాశ్వత ఆహ్వానితుల జాబితాలో పూర్వపు విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు అవకాశం కల్పించారు.

ఇక ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పల్లంరాజు, పవన్ ఖేరా, గణేష్ గొడియాల్, అల్కా లంబా,ప్రీతి షిండే వంటి వారు ఉన్నారు. ఇంతకు ముందు సిడబ్లుసి పునర్వస్థీకరణ 2020 సెప్టెంబర్ 11న సోనియా గాంధీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ఖర్గే పగ్గాలు చేపట్టిన తరువాత ఏర్పడ్డ తొలి కమిటీ ఇదే . పలు దఫాల సంప్రదింపులు, రాష్ట్రాలవారిగా పరిస్థితులను ఆకళింపు చేసుకుని వర్కింగ్ కమిటీ ఏర్పాటు జరిగింది. 84 మంది సభ్యుల వర్కింగ్ కమిటీ సభ్యుల మండలిలో 15 మంది మహిళలకు అవకాశం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News