Sunday, December 22, 2024

తెలంగాణలోకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాకర్త !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైన రాజకీయ వ్యూహాకర్తను తెలంగాణకు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేయగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాకర్త అయిన సునీల్ కానుగోలుకు ఈ క్రెడిట్ దక్కింది. కర్ణాటకలో రాజకీయ ఎన్నికలపై విస్తృతంగా సర్వేలు చేసి అభ్యర్థులను ఖరారు చేయడంలో సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ వ్యూహం ఫలించడంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
119 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వేలు
ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో సునీల్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల హవా జోరందుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సునీల్ రంగంలోకి దిగి తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వేలు చేయించారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు
ఇప్పటికే ఈ సర్వేను సైతం కాంగ్రెస్ హైకమాండ్‌కు సునీల్ సమర్పించినట్లుగా సమాచారం. దీంతోపాటు సునీల్ టిపిసిసి అధిష్టానంతో ఈ విషయమై పలు దఫాలుగా చర్చించినట్టుగా తెలిసింది. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న 70 మంది అభ్యర్థుల పేర్లను సునీల్ ఖరారు చేసినట్లుగా వినికిడి. ఈ జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు ఉన్నట్టుగా సమాచారం.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థుల ఖరారు
మిగిలిన 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు నుంచి నాలుగు పేర్లను సునీల్ సూచించినట్టుగా తెలిసింది. ఈ 70 మంది అభ్యర్థులకు సంబంధించి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయంపైనే అభ్యర్థులను ఖరారు చేయాలని టిపిసిసి నిర్ణయించినట్టుగా సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పేర్లు ఖరారు కాగా, ఖమ్మంలో ఐదు స్థానాలకు అయినట్టుగా తెలిసింది. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పొంగులేటి రాజకీయ అనుభవాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు.
మిగిలిన పేర్లు త్వరలోనే అధిష్టానానికి….
వరంగల్‌లో ఆరు, కరీంనగర్‌లో ఐదు నియోజకవర్గాలకు సునీల్ పేర్లను సూచించారు. మొత్తం మీద 119 టిక్కెట్లలో సగానికి పైగా కన్ఫర్మ్ అయ్యాయని, మిగిలిన వాటి గురించి సునీల్ త్వరలోనే అధిష్టానానికి మిగిలిన పేర్లను అందచేస్తారని తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో 2023 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News