Thursday, January 23, 2025

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఎక్కువ కాలం దేశాన్ని పాలించి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయి కుంగికునారిల్లుతున్న జాతీ య ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధ్యక్ష ఎన్నికల నగారా మోగనుండడం విశేష పరిణామమే. ఇందుకు పూర్వరంగం సిద్ధమైన సూచనలు గత కొద్ది రోజులుగా బలంగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై అధిష్ఠానం నుంచి ఒత్తిడి బాగా వుంది. ఆయన తాజాగా తన పార్టీ ఎంఎల్‌ఎలనందరినీ సమావేశ పరచి అవసరమైతే మీరంతా ఢిల్లీకి రావలసి వుంటుందని తెలియజేసినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇంకొక వైపు కేరళ (తిరువనంతపురం) ఎంపి శశిథరూర్ సోనియా గాంధీని కలుసుకొని తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పడం, ఆమె అందుకు హర్షం వ్యక్తం చేయడం తెలిసిందే.

అధిష్ఠానం తరపున అధికార అభ్యర్థులెవరూ వుండరని పార్టీ సభ్యులెవరైనా పోటీ చేయవచ్చునని కాంగ్రెస్ నాయకత్వం సష్టంగా తెలియజేసింది. అందుచేత ఈసారి పోటీ తీవ్రంగానే వుండవచ్చు. అయితే పార్టీ అధ్యక్ష స్థానంలో గాంధీల కుటుంబేతరులు కూర్చున్నా వ్యవహారాలు ఆ వ్యక్తి చేతుల్లో వుంటాయా లేక ఆ కుటుంబం వెనుక సీటు డ్రైవింగ్ చేస్తుందా అనేది కీలక ప్రశ్న. సరిగ్గా ఇదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను అట్టహాసంగా జరుపుతున్నారు. తన ప్రతిష్ఠను పెంచుకునే కార్యక్రమాన్ని ఆయన నిరంతరం జరిపిస్తూనే వున్నారు. ప్రధాని మోడీని సునిశితంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుత యాత్ర ద్వారా మోడీని నేరుగా ఢీ కొట్టగలిగే శక్తి తనకే వున్నదని చాటుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీల కుటుంబం బయటి వ్యక్తులు కాంగ్రెస్ అధ్యక్షులైనా వారు చేయగలిగేముంటుంది? అందుకే గెహ్లాట్ కూడా అత్యంత అయిష్టంగానే సోనియా గాంధీ మాట ప్రకారం నడుకోదలిచారని అర్థమవుతున్నది.

ఆయన పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి వస్తుంది. అందుకు సిద్ధంగా లేరని బోధపడుతున్నది. ముఖ్యమంత్రి పదవిని పార్టీలో తన ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్‌కు అప్పజెప్పడం గెహ్లాట్‌కు బొత్తిగా ఇష్టం లేదు. తాను బరిలో దిగడానికి ముందు కేరళలో భారత్ జోడో యాత్రలో వున్న రాహుల్ గాంధీని కలుసుకొని పార్టీ అధ్యక్ష పదవి స్వీకరించేలా ఒప్పించడానికి మరోసారి ప్రయత్నిస్తానని గెహ్లాట్ ప్రకటించారు. కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం వినిపించిన 23 మంది సీనియర్ నేతలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, కింది నుంచి పై వరకు స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో గతంలో చివరిసారిగా 2000 సంవత్సరంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పుడు సోనియా గాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు. అంతకు ముందు 1997లో సీతారాం కేసరి చేతిలో శరద్ పవార్, రాజేశ్ పైలట్లు పరాజయం పాలయ్యారు. అతి ఎక్కువ కాలం పార్టీ అధ్యక్షురాలుగా వున్న ఖ్యాతి సోనియా గాంధీకి చెందుతుంది. కాంగ్రెస్, కుటుంబ పాలనలోని పార్టీ అని ప్రధాని మోడీ చిరకాలంగా పదేపదే విమర్శిస్తున్నారు. ఈ విమర్శ నుంచి బయటపడడం కోసం అంతర్గత ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించక తప్పలేదు.

కాని గాంధీల పట్ల పార్టీలో వున్న విధేయత అంతాఇంతా కాదు. అధ్యక్ష పదవిని రాహుల్ తిరిగి చేపట్టాలని కోరుతూ దశాధిక రాష్ట్రాల పిసిసిలు తీర్మానాలు చేశాయి. కుటుంబ పాలనలోని పార్టీ అయినా కుటుంబమే లేని వారి నాయకత్వంలోని పార్టీ అయినా అధికారంలో వుండగా ప్రజలకు ఏమి ఒరగబెట్టింది అనేదే దాని గొప్పతనానికి గీటురాయి అవుతుంది. ఈ కొలబద్దతతో కొలిచినప్పుడు అధిక ధరలు, నిరుద్యోగం, ప్రైవేటైజేషన్ వంటి భరించలేని సమస్యలతో ప్రజలను రాచిరంపానపెడుతున్నదనే ఖ్యాతి ప్రధాని మోడీ ప్రభుత్వం ఖాతాలోనే అమితంగా చేరుతుంది.

గత మే నెలలో ఉదయ్ పూర్ చింతన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. భారత్ జోడో యాత్ర నిర్ణయం అక్కడి నుంచే వెలువడింది. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, రాజ్యాంగ మౌలిక విలువలపై జరుగుతున్న దాడితో రాజీలేని పోరాటం చేయాలని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో గట్టి సంకల్పం చెప్పుకున్నది. ఆ పార్టీకి అధ్యక్షుడు అయ్యేవారు ఈ డిక్లరేషన్‌ను అమలు చేయడానికి కృషి చేయవలసి వుంటుంది. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ నాయకుడుగా ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకొనేందుకు పాటుపడుతున్న నేపథ్యంలో గాంధీల కుటుంబం బయటి వ్యక్తి పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైతే ఎలా వుంటుందో చూడాల్సిందే. అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చాటుకోడానికే ఈ ఎన్నికల ఘట్టం పరిమితమైతే కావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News