Sunday, April 13, 2025

జాతీయ హీరోలపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ‘పక్కా కుట్ర

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ హీరోలకు వ్యతిరేకంగా ‘పక్కా కుట్ర’ సాగించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ఆరోపించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సిద్ధాంతం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి భిన్నమైనదని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో ‘ఏమాత్రం పాత్ర లేని’ సంస్థ ఆయన వారసత్వం గురించి చెప్పుకోవడం హాస్యాస్పదం అని ఖర్గే అన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ మెమోరియల్‌లో విస్తృత కాంగ్రెస్ కార్యవర్గం (సిడబ్లుసి) సమావేశంలో ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తూ, ఇప్పుడు మతపరమైన విభజనకు పాల్పడడం ద్వారా దేశంలోని మౌలిక సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారని కూడా ఆరోపించారు. ‘మరొక వైపు స్వల్ప జనాధిపత్యం దేశ వనరులను గుప్పిటలోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రించే పథంలో సాగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

సర్దార్ పటేల్‌ను ఖర్గే ఉటంకిస్తూ, సంస్థాగత బలం ప్రధానమైనదేనని, సంస్థ లేకుండా కేవలం సంఖ్యాబలం అర్థరహితం అని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా జాతీయ హీరోలు పలువురి విషయమై పక్కా కుట్ర సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘గడచిన 140 సంవత్సరాలుగా దేశానికి సేవ చేసిన, దేశం కోసం పోరాడిన మహోన్నత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తమ విజయాలుగా చూపేందుకు ఏమీ లేనివారే ఈ పని చేస్తున్నారు’ అని ఖర్గే విమర్శించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఖర్గే విరుచుకుపడుతూ, స్వాతంత్య్రోద్యమంలో తమ కృషిగా చూసేందుకు వారికి ఏమీ లేదని ఆయన అన్నారు. సర్దార్ పటేల్, పండిత్ నెహ్రూ మధ్య సంబంధాన్ని ఆ దిగ్గజాలకు ఒకరంటే ఒకరికి పడదనేలా చూపేందుకు అవి కుట్ర పన్నాయి.

వారు ఒక నాణానికి రెండు వైపుల వారనేది వాస్తవం. వారి మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు ఉన్నాయనేందుకు దాఖలాలుగా అనేక ఘటనలు, పత్రాలు ఉన్నాయి’ అని ఖర్గే స్పష్టం చేశారు. ‘వారిద్దరి మధ్య దాదాపు రోజూ ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతుండేవి. నెహ్రూజీ అన్ని విషయాలపై ఆయన సలహా తీసుకుంటుండేవారు. పటేల్ సాహెబ్ అంటే నెహ్రూజీకి అపార గౌరవం ఉంది. ఆయన ఏదైనా సలహా తీసుకోవలసి వస్తే స్వయంగా పటేల్‌జీ ఇంటికి వెళుతుండేవారు. పటేల్‌జీ సౌకర్యార్థం సిడబ్ల్యుసి సమావేశాలను ఆయన నివాసంలో నిర్వహించారు’ అని ఖర్గే తెలియజేశారు. పటేల్ సిద్ధాంతం ఆర్‌ఎస్‌ఎస్ భావాలకు విరుద్ధమైనదని, ఆయన ఆ సంస్థను నిషేధించారు కూడా అని ఖర్గే స్పష్టం చేశారు.

‘ఇప్పుడు ఆ సంస్థ వ్యక్తులు సర్దార్ పటేల్ వారసత్వం గురించి చెప్పుకోవడం హాస్యాస్పదం’ అని ఖర్గే పేర్కొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌ను రాజ్యాంగ సభ సభ్యునిగా చేయడంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ ముఖ్య పాత్ర పోషించారని ఆయన చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే రాజ్యాంగం రచన జరిగి ఉండేదే కాదు’ అని 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ స్వయంగా చెప్పారని ఖర్గే గుర్తు చేశారు. ‘రాజ్యాంగ రూపకల్పన జరిగినప్పుడు గాంధీజీని, పండిత్ నెహ్రూను, డాక్టర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ను ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా విమర్శించింది.

వారు రామ్‌లీలా మైదాన్‌లో రాజ్యాంగం, ఆ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాజ్యాంగానికి మనువాది లక్షాలు స్ఫూర్తి కాదని కూడా వారు అన్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గాంధీ, బాబా సాహెబ్ విగ్రహాలను పార్లమెంట్ ప్రాంగణంలో నుంచి తొలగించి, ఒక మూలన పెట్టడం ద్వారా మోడీ ప్రభుత్వం వారిని అవమానించిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను కాంగ్రెస్ గౌరవిస్తుంటుందని, దానిని ఎలా రక్షించాలో పార్టీకి తెలుసునని ఖర్గే స్పష్టం చేశారు. గాంధీతో సంబంధం ఉన్న సంస్థలను బిజెపి, సంఘ్ పరివార్ వ్యక్తులు స్వాధీనం చేసుకుని, వాటిని ఆయన సైద్ధాంతిక ప్రత్యర్థులకు అప్పగిస్తున్నట్లు కూడా ఖర్గే ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News