Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ జర్నలిస్టు సుచరితా మొహంతి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన వద్ద డబ్బుల్లేవని, నిధులు సమకూర్చడానికి పార్టీ నిరాకరించిందని తెలియచేస్తూ పార్టీ టికెట్‌ను వాపసు చేశారు. నిధులు సమకూర్చడానికి పార్టీ నిరాకరించడంతో పూరీ లోక్‌సభ నియోజకవర్గంలో తన ప్రచారానికి గట్టి దెబ్బ తగిలిందని శుక్రవారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు పంపిన మెయిల్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపి బ్రజమోహన్ మొహంతి కుమార్తె అయిన సుచరిత తెలిపారు. సొంత వనరులతోనే ఎన్నికల్లో పోటీ చేయాలని ఎఐసిసి ఒడిశా ఇన్‌చార్జ్ అజయ్ కుమార్ నిర్దంద్వంగా తెలిపారని ఆమె ఆరోపించారు. పదేళ్ల క్రితం రాజకీయాలలోకి ప్రవేశించిన తాను జీతం పైన ఆధారపడి పనిచేసిన జర్నలిస్టునని ఆమె తన మెయిల్‌లో తెలిపారు. ప్రగతిశీల రాజకీయాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ప్రచారం నిమిత్తం విరాళాలు అందచేయాలని ప్రజలను కూడా కోరానని, అయితే ఇది సత్ఫలితాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు.

అప్పటికీ ఎన్నికల ప్రచార ఖర్చును బాగా తగ్గించానని ఆమె చెప్పారు. సొంతంగా నిధులు సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో నిధుల కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతోసహా సీనియర్ నాయకులందరినీ కలిశానని ఆమె తెలిపారు. సూరీలో గెలిచే అవకాశం ఉన్న తనకు ప్రచారం చేయడానికి నిధులు లేకపోవడమే తీరని లోటని ఆమె పేర్కొన్నారు. పార్టీ నుంచి నిధులు లేకుండా ఎన్నికల ప్రచారం కొనసాగించడం తనకు అసాధ్యమని, ఈ కారణంగా పూరీ లోక్‌సభ నియోజకవర్గ టికెట్‌ను వాపసు చేస్తున్నానని ఆమె తన మెయిల్‌లో ప్రకటించారు. ఏదేమైనా తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని, తన నాయకుడు ఎప్పటికీ రాహుల్ గాంధీయేనని సుచరిత స్పష్టం చేశారు. పూరీ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, బిజెడి అభ్యర్థిగా ముంబై మాజీ పోలీసు కమిషనర్ అరూప్ పట్నాయక్ పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News