Monday, December 23, 2024

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ

- Advertisement -
- Advertisement -

రైతుల పోస్టులు, అకౌంట్లను బ్లాక్ చేయమని ఆదేశాలు
సోషల్ మీడియా ఎక్స్‌కు ప్రభుత్వ ఉత్తర్వులపై ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను, పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సామాజిక మాధ్యమం ఎక్స్ విబేధించిన నేపథ్యంలో దేశంలో ప్రాజస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ గురువారం ఆరోపించింది. బాధిత అకౌంట్లు, పోస్టులకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలంటూ ఎక్స్ ఇచ్చిన పిలుపును కూడా కాంగ్రెస్ ప్రస్తావించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ అభ్యర్థనపై రైతుల నిరసనలకు సంబంధించిన 177 అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ వివిధ సామాజిక మీడియా వేదికలను ఆదేశించినట్లు వర్గాలు వెల్లడించాయి.

ఎక్స్‌కు చెందిన గ్లోబల్ గవర్న్‌మెంట్ అఫేర్స్ టీమ్ జారీచేసిన ప్రకటనను ట్యాగ్ చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ భారత్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఆరోపించారు. కొన్ని నిర్దిష్టమైన అకౌంట్లు, పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ భారత ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీచేసిందని, అలా చేయని పక్షంలో జరిమానాలు, జైలు శిక్షను ఎదుర్కోవలసి వస్తుందని కూడా హెచ్చరించిందని ఎక్స్ గ్లోబల్ గవర్న్‌మెంట్ అఫేర్స్ టీమ్ తన ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఖాతాలు, పోస్టులను భారత్‌లో మాత్రమే బ్లాక్ చేస్తామని ఎక్స్ తెలిపింది. అయితే ఈ చర్యలతో తాము విభేదిస్తున్నామని ఎక్స్ స్పష్టం చేసింది.

ఈ పోస్టులకు, అకౌంట్లకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించాలని ఎక్స్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణలో ఉందని, పారదర్శకతను పెంపొందించడానికి ఈ ఉత్తర్వులను బహిర్గతం చేయవలసి ఉంటుందని కూడా ఎక్స్ తెలిపింది. న్యాపరమైన ఆంక్షల మేరకు తాము ప్రభుత్వ ఉత్తర్వులను ప్రచురించలేకపోతున్నామని, పారదర్శకత కోసం వీటిని బహిర్గతం చేయడం అవసరమని తాము నమ్ముతున్నామని ఎక్స్ పేర్కొంది. వీటిని బయటపెట్టకపోవడం బాధ్యతాలేమికి, నియంతృత్వ చర్యకు దారితీయగలదని ఎక్స్ వివరించింది. కంపెనీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్వర్వును జతచేస్తూ సంబంధిత బాధిత అకౌంట్లకు క్స్ నోటీసులు జారీచేసింది.

కాగా తమ, డిమాండ్లను నెరవేర్చాలని డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు గత కొద్ది రోజులుగా నిరసనలు తెలియచేస్తున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని వంటి పలు డిమాండ్లతో రైతులు ఛలో ఢిల్లీ యాత్ర చేపట్టారు. పంజాబ్, హర్యానా మధ్య సరిహద్దుల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణల్లో ఒక రైతు మరణించగా, 12 మంది పోలీసులు గాయపడిన దరిమిలా గురువారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీ యాత్రకు రైతు నాయకులు విరామం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News