Monday, December 23, 2024

రాజస్థాన్‌లో 33 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు గడిచినా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు 33 మంది అభ్యర్థులతో మొదటి జాబితా శనివారం విడుదలైంది. ఈ జాబితా లోని 33 మంది అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ ఈసారి కూడా సర్దార్‌పుర నియోజక వర్గం నుంచి, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ టోంక్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. సచిన్‌పైలట్ శిబిరం లోని నలుగురు అభ్యర్థులకూ ఈ జాబితాలో చోటు దక్కింది. నాథ్‌ద్వార నుంచి స్పీకర్ సిపి జోషి, లక్ష్మణ్‌గఢ్ నుంచి రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతసారా పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ లభించింది. డిస్కస్ త్రో క్రీడాకారిణి, అంతర్జాతీయ టోర్నీలో గోల్డ్ మెడలిస్ట్ కృష్ణ పూనియా సాధుల్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. శుక్రవారం దౌసా లోని ర్యాలీలో ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లా లోని సిటింగ్ ఎమ్‌ఎల్‌ఎలందరికీ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

దౌసా జిల్లా లోని సిటింగ్ ఎమ్‌ఎల్‌ఎల పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పర్సాది లాల్ మీనా, మమతా భూపేష్, మురళీలాల్ మీనా, జిఆర్ ఖటన, తదితర సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎల పేర్లు ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎ ఓం ప్రకాష్ హుడ్లాకు కూడా ఓటు వేసి గెలిపించాలన సిఎం అభ్యర్థించారు. సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎల పేర్లు ఏవైతే సిఎం ప్రస్తావించారో వారందరికీ ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎతో సహా కాంగ్రెస్ టికెట్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రముఖంగా ప్రజలకు గుర్తు చేశారు. ప్రభుత్వ పనితీరు పైనే ఎన్నికల పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. దౌసా జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలుండగా, వాటిలో నాలుగు కాంగ్రెస్, ఒకటి ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎల ప్రాతినిధ్యంలో ఉన్నాయి. నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News