న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలలో కాంగ్రెస్ లేవనెత్తాలనుకుంటున్న జాబితాను నేడు(డిసెంబర్6న) భారత జాతీయ కాంగ్రెస్ విడుదలచేసింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ దృష్టా ఇప్పటికే శీతాకాలం సమావేశాలు ఓ నెల రోజులు ఆలస్యం అయింది.
పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ 16 అంశాలను లేవనెత్తనున్నట్టు జాబితాను ప్రకటించింది. అందులో భారత జాతీయ భద్రతకు విదేశీ ముప్పు, చైనా చొరబాటు, విదేశాంగ విధానం, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)పై సైబర్ దాడి, లక్షలాది మంది డేటా చోరి, అదుపులేని ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ప్రభుత్వ శాఖలలో, ఇతర సంస్థల్లో భర్తీలు లేకపోవడంతో అత్యధిక నిరుద్యోగిత పెరిగిపోవడం, కొత్త ఉపాధి కల్పన వంటి అనేక అంశాలున్నాయి. 17 సెషన్ల పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. ఆ విషయంలో కాంగ్రెస్ నిలదీయాలనుకుంటోంది. రాజ్యసభ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అధ్యక్షత వహించనున్న తొలి సమావేశం ఇది.
రైతులకు మద్దతు ధర గ్యారంటీ, అటవీ హక్కుల చట్టం నీరుగార్చటం, సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన వంటి అంశాలను కూడా కాంగ్రెస్ లేవనెత్తబోతోంది. కాంగ్రెస్ లేవనెత్త నున్న జాబితాలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు, ఆర్థికంగా వెనుకబడినవారికి 10 శాతం రిజర్వేషన్ అన్న సుప్రీంకోర్టు తీర్పు, గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిపోవడం, రూపాయి విలువ పతనమైపోతుండడం, ఎగుమతులు తగ్గిపోవడం, జిడిపి రేటు క్షీణించడం, జమ్మూకశ్మీర్ సమస్యలు, కశ్మీర్ పండిత్‌లపై దాడులు వంటివి లేవనెత్తబోతుంది.