న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్ నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జిలు, పిసిసి అధ్యక్షుల సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ విషయం తెలియజేసారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ యాత్ర రూట్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్రగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఇంతకు ముందు కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ యాత్ర పార్టీకి మంచి ఊపునిచ్చింది. యాత్ర తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పుడు దక్షిణ భారత దేశంనుంచి ఉత్తర భారతానికి యాత్ర చేపట్టగా ఇప్పుడు తూర్పునుంచి పడమరకు భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టనున్నారు.
పార్టీ విడుదల చేసిన రూట్ ప్రకారం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక రోజులు అంటే 11 రోజుల పాటు 1,074 కిలోమీటర ్లమేర సాగుతుంది. రాజకీయంగా కీలకమైన అమేథీ, రాయబరేలి, వారణాసి, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాలమీదుగా యాత్ర సాగుతుంది. ఇంఫాల్‌లో జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 67 రోజుల పాటు, 6,713 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. ఎక్కువగా బస్సుల్లో అక్కడక్కడా పాదయాత్రగా సాగే ఈ యాత్ర 110 జిల్లాలు, 100 పార్లమెంటు స్థానాలు,337 అసెంబ్లీ స్థానాల మీదుగా సాగుతుంది. తొలుత 14 రాష్ట్రాల మీదుగా యాత్ర చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పుడు మరో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా చేర్చారు.ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానించామని, ఇందుకు సంబంధించిన ఆహ్వానాలను కూడా పంపిస్తున్నామని జైరాం రమేశ్ చెప్పారు. భారత్ జోడో యాత్ర మాదిరిగానే భారత్ జోడో న్యాయ యాత్ర కూడా భారత రాజకీయాల స్వరూపాన్ని మార్చివేసేదిగా అవుందన్న ఆశాభావాన్ని జైరాం రమేశ్ వ్యక్తం చేశారు.
ఈ నెల 14న ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే యాత్ర మణిపూర్‌లో ఒక రోజు సాగుతుందని, నాలుగు జిల్లాల్లో 107 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుందని చెప్పారు. ఆ తర్వాత యాత్ర నాగాలాండ్‌లో రెండు రోజుల పాటు, అసోంలో అయిదు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. ఆ తర్వాతత అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయలలో ఒక్కో రోజు యాత్ర ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అయిదు రోజులు, బీహార్‌లో నాలుగు రోజులు యాత్ర సాగుతుందని జైరాం రమేశ్ చెప్పారు. జార్ఖండ్‌లో ఎనిమిది రోజుల పాటు 804 కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. ఒడిశాలో నాలుగు రోజులు, చత్తీస్‌గఢ్‌లో కొసాగుతుంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 11 రోజుల పాటు సాగే యాత్ర 20 జిల్లాల్లో 1,074 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని చెప్పారు. మధ్య ప్రదేశ్‌లో ఏడు రోజులు సాగే యాత్ర రాజస్థాన్‌లో ఒక రోజు మాత్రమే కొనసాగుతుంది. గుజరాత్, మహారాష్ట్రలలో అయిదు రోజుల చొప్పున కొనసాగే యాత్ర మార్చి 20 లేదా 21న ముంబయిలో ముగుస్తుందని జైరాం రమేశ్ తెలిపారు.