Monday, January 20, 2025

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పందించింది. పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది. సమాదరిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇదే క్రమంలో ఇతరులు తమ అభిప్రాయాలు ఏమైనా వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. సనాతన ధర్మం సమాజానికి చేటుగా మారిందని, దీనిని పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నేత అయిన ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యానించడం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది.ఈ మాటలపై కాంగ్రెస్‌లోనూ , ఇండియా కూటమిలోనూ వేర్వేరు అభిప్రాయాలు, స్పందనలు వెలువడ్డాయి. అయితే తమ పార్టీ అధికారిక వైఖరిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్‌కు నిర్థిష్టమైన వైఖరి ఉందని , మతాల పట్ల సర్వధర్మ సద్భావన విధానం కాంగ్రెస్‌కు ఉందని తెలిపారు.

అన్ని మతాలను గౌరవించడం జరుగుతుంది. ఇదే విధంగా మరో విషయం అర్థం చేసుకోవల్సి ఉంటుందని ప్రతిరాజకీయ పార్టీకి తమ అభిప్రాయాలు తెలియచేసే స్వేచ్ఛ ఉందని తెలిపారు. అందరి విశ్వాసాలను పార్టీ మన్నిస్తుందన్నారు. కాగా కర్నాటక మంత్రి , పార్టీ నేత ప్రియాంక్ ఖర్గే పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ మాటలను సమర్థించారు. సమాన హక్కులను, అవకాశాలను కల్పించని మతం ఏదైనా అనుచితమే అవుతుంది. అటువంటిది నిజానికి మతమే కాదని, ఓ వ్యాధి వంటిదే అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు అయిన ప్రియాంక్ తెలిపారు. స్టాలిన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, విచక్షణారహితం అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన డాక్టర్ కరణ్ సింగ్ చెప్పారు. సరైన విషయ పరిజ్ఞానం లేకుండా స్టాలిన్ మాట్లాడినట్లుగా ఉందన్నారు. పైగా సనాతన ధర్మం పాటించే పలు ప్రముఖ దేవాలయాలు తమిళనాడులోనే ఉన్నాయని, శ్రీరంగం,తంజావురు , తిరువన్మళై, చిదంబరం, రామేశ్వరం వంటివాటి గురించి తెలియదా అని ప్రశ్నించారు.

ఇండియా కూటమిలోని శివసేన యుబిటి నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ సనాతన ధర్మం విషయాన్ని కూడా బిజెపి రాజకీయం చేస్తోందని, రాజకీయ లబ్థికి తమను తాము సనాతన ధర్మ పరిరక్షకులుగా తెలియచేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇదంతా హిపోక్రసీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ బిజెపి మిత్రపక్షాల వారే రాముడిని, హనుమంతుడిని కించపర్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. జాతీయత, భక్తి గురించి సర్టిఫికెట్లు పంచే బాధ్యత బిజెపి తీసుకుందా? అని ప్రశ్నించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిజెపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలతోస్పందించారు. తమిళనాడులో ఆయనపై కేసులకు సిద్ధం అయ్యారు. డిఎంకె నేతలిద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో తమ నిరసన లేఖలను అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News