Wednesday, January 22, 2025

రాజస్థాన్‌లో ఉప ఎన్నికలో బిజెపి మంత్రి ఓటమి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో అధికార బిజెపికి ఎన్నికల ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి సురేంద్రపాల్ సింగ్ కరాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన పోటీలో ఓటమి పాలయ్యారు. సోమవారం ఫలితంవెలువడింది. ఇక్కడ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రూపీందర్ సింగ్ కూనర్ చేతిలో ఓడారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈ మంత్రిని దాదాపు 95,000 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల దశలో కరాన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ అకాల మరణంతో ఈ స్థానానికి అప్పుడు పోలింగ్ వాయిదా వేశారు ఈ నెల 5వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఫలితం వెలువడింది. ఇక్కడి నుంచి రూపీందర్ సింగ్ విజయం సాధించిన విషయాన్ని ఎన్నికల సంఘం ధృవీకరించింది.

రాష్ట్రంలోని భజన్‌లాల్ శర్మ సారధ్యపు మంత్రివర్గంలోకి డిసెంబర్ 30 వ తేదీననే సురేంద్రను తీసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ బోర్డు, మైనార్టీ వ్యవహారాల శాఖను అప్పగించారు. నిబంధనల ప్రకారం మంత్రులుగా నియమితులు అయిన తరువాత ఆరు నెలలలోగా సదరు వ్యక్తులు అసెంబ్లీకి ఎన్నిక కావల్సి ఉంటుంది. ఈ దశలో ఇప్పుడు జరిగిన ఎన్నికలో మంత్రి పరాజయం, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ఓటమి చోటుచేసుకోవడం కీలక పరిణామం అయింది. ఇక్కడి కాంగ్రెస్ విజేతకు పలువురు ప్రముఖ నేతలు అభినందనలు తెలిపారు. బిజెపి గర్వభంగం జరిగిందని మాజీ సిఎం అశోక్ గెహ్లోట్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News