Thursday, January 23, 2025

దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..

- Advertisement -
- Advertisement -

దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..
అగ్నిపథ్ పథకం బిజెపి ద్వంద వైఖరికి నిదర్శనం
కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు
అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలి
గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేతల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షను కాంగ్రెస్ నేతలు చేపట్టారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమం జరుగుతోందని, ఇక్కడ రాజకీయ జోక్యం లేదన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చించకుండా డిఫెన్స్‌లో కొత్త విధానాన్ని ఏ విధంగా తీసుకొస్తారని ప్రశ్నించారు. మోడీ క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశమంతా నిరసనలతో అట్టుడుకుతోందని, దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టం వచ్చిందని ఆరోపించారు. మోడీ తెచ్చే ప్రతి పథకం తన స్నేహితులు ఆదానీ, అంబానీల కోసమేనని ధ్వజమెత్తారు. పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని నాలుగేళ్లకే తీసుకోవడం అన్యాయమన్నారు.

ఈ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఘటనపై బిజెపి నాయకుల తీరును పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వరంగల్ రావాలని సవాల్ విసిరారు. అగ్నిపథ్ రద్దయ్యే వరకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్ ఉద్యమం బిజెపి పాలిత రాష్ట్రాలైన యూపి, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కాల్పుల ఘటనకు బాధ్యులు ఎవరిని ఆయన ప్రశ్నించారు. కరోనాతో బాధపడుతున్న సోనియాగాంధీ సైతం అగ్నిపథ్ విషయంలో పోరాటం చేస్తున్న యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు. యువత ఎవరు కూడా తొందరపడి బలికావద్దని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశం మొత్తం వ్యతిరేకత వచ్చిందని, ఈ పరిస్థితుల్లో ‘సేవ్ ఆర్మీ’ పేరుతో పోరాటం చేయాలని ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. అగ్నిపథ్‌లో 75 శాతం మందిని ఇంటికి పంపిస్తే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకం బిజెపి ద్వంద వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉన్నపళంగా రాతపరీక్ష రద్దు చేయడంతో వేలాది మంది నిరుద్యోగులు నిరాశలకు లోనై ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో తాజా పరిస్థితులను గమనించైనా అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలని హస్తం నేతలు డిమాండ్ చేశారు.

Congress Satyagraha Deeksha at Gandhi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News