Friday, November 22, 2024

గెలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషణ !

- Advertisement -
- Advertisement -
టికెట్ కోసం భారీగా ఎన్‌ఆర్‌ఐల దరఖాస్తు ?
ఖర్చుకు వెనుకాడని వారి కోసం కాంగ్రెస్ ఎదురుచూపు
నిధుల సమీకరణకు కాంగ్రెస్ నాయకుల కసరత్తు

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా గెలిచే అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఖర్చుకు వెనుకాడకుండా ఉండే అభ్యర్థులకు టికెట్‌లను కేటాయించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో భాగంగా ఎన్‌ఆర్‌ఐలను కూడా కాంగ్రెస్ సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ సూచనల మేరకు ఇప్పటికే భారీగా ఎన్‌ఆర్‌ఐలు ఆ పార్టీ తరఫున ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 30 మంది ఎన్‌ఆర్‌ఐలు తమ తమ నియోజకవర్గాల్లో టికెట్‌ను ఆశిస్తుండగా కాంగ్రెస్ కూడా ఆయా నియోజకవర్గాల్లో వారి గెలుపు, ఓటముల గురించి సర్వే నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ గెలవకున్నా కొందరికి మాత్రం కచ్చితంగా టికెట్‌లను కాంగ్రెస్ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మరికొందరికి మాత్రం రానున్న రోజుల్లో పార్టీ గెలిస్తే వారి సేవలను వినియోగించుకునేలా టిపిసిసి ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఎన్‌ఆర్‌ఐలు పోటీలో నిలబడితే పార్టీ ఖర్చుకు ఇబ్బంది ఉండదని, మిగతా పార్టీలకు ధీటుగా పోటీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.
నిధుల సమీకరణ కోసం
దీంతోపాటు ఎన్‌ఆర్‌ఐల నుంచి పార్టీకి ఫండింగ్ చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐలతో పాటు వ్యాపారవేత్తలు, ఫార్మా కంపెనీల అధినేతలను ఈ విషయమై ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల టిపిసిసి చీఫ్ రేవంత్ అండ్ టీమ్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఎన్నికల ఖర్చులో భాగంగా నిధులను సమీకరించాలని ఎన్‌ఆర్‌ఐలను కోరినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునే ఉద్ధేశ్యం లేకపోవడంతో చాలామంది ఈ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న ఆశతో కాంగ్రెస్ నాయకులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలకు తక్కువ కాకుండా ఆర్థికంగా బలపడాలని ఫిక్స్ అయ్యారు. దీంతో పార్టీ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లోనూ మనోధైర్యం పెరుగుతోంది. పార్టీ నుంచి కొంత సహకారం అందితే తమకు మేలు జరుగుతుందని టికెట్ ఆశించే అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హామీ ఇచ్చిన కాంట్రాక్టర్‌లు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పెద్ద కంపెనీల యాజమాన్యాలతో పాటు కాంట్రాక్టర్‌లు ఆ పార్టీకి ఫండ్ ఇస్తామని హామి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 95 శాతం ఫార్మా కంపెనీలు రెడ్డిలకు చెందినవే కావడంతో రేవంద్‌తో పాటు కాంగ్రెస్‌లోని ఉన్నత స్థాయి రెడ్డి లీడర్లు ఆయా కంపెనీల యజమానులను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఫండింగ్‌కు సంబంధించి కొన్ని కంపెనీలతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయని వచ్చే నెలలోగా మరిన్ని కంపెనీ యాజమాన్యాలను కలవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News