Wednesday, November 13, 2024

తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు.. రేవంత్ టార్గెట్ గా ఒక్కటైన సీనియర్లు..!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో తిరుగుబాటు.. ‘సేవ్ కాంగ్రెస్’ అంటూ సీనియర్ల ఉద్యమం
టార్గెట్ రేవంత్..?
ఎఐసిసి కార్యక్రమాల అమలుపై పిసిసి సమావేశం పెట్టినా బహిష్కరించాలనే యోచన
మంగళవారం మరోసారి సీనియర్ నేతల భేటీ
మాణికం ఠాగూర్ వైఖరిపైనా చర్చించే అవకాశం
అదే రోజు అజెండా ఖరారు..!
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్‌లో పిసిసి కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. అసలు కాంగ్రెస్ నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతుందనే వాదన వినిపించారు. దీంతో వలస వచ్చిన నాయకులు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా పరిస్థితి మారిందనే చెప్పాలి. ఇందుకు శనివారం సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్క్లితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. అలాగే ఈ సమావేశంలో పిసిసి నిర్వహించే ఏ సమావేశానికి కూడా హాజరు కాకూడదని నేతలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం ఎఐసిసి కార్యక్రమాల అమలుపై పిసిసి సమావేశం పెట్టిన బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. అలాగే మంగళవారం మరోసారి సమావేశం కావాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను భాగస్వామ్యం చేయాలనే వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నట్టుగా సమాచారం.

మంగళవారం జరిగే సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వారి అజెండాను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శనివారం భట్టి నివాసంలో జరిగిన సమావేశం అనంతరం నేతలు మాట్లాడుతూ.. ఒరిజినల్ కాంగ్రెస్ నినాదంతో వలస వచ్చిన నేతల వల్ల పార్టీ నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. పిసిసి కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే ముఖ్యంగా టిడిపి నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు.

సోషల్ మీడియా పోస్టులతో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న నాయకులపై కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే ఉన్నామని, కాంగ్రెస్‌లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన పిసిసి ఎగ్జిక్యూటివ్, జిల్లా కమిటీల నియామకానికి సంబంధించి సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు బాహాటంగానే తమ నిరసనను తెలియజేశారు. పిసిసి చీఫ్ రేవంత్ నిర్ణయాలను వీరంతా మూకుమ్మడిగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

సామాజిక న్యాయం జరిగిందంటున్న రేవంత్ వర్గం…
పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విడుదల చేసిన వివిధ కమిటీలలో టిడిపి నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తుల జాబితాను ప్రకటించారు. పిసిసి కమిటీ ప్రకటించిన 22 మందిలో టిడిపి నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ లేరని స్పష్టం చేశారు. పిఇసి కమిటీలో 40 మంది ఉండగా టిడిపికి చెందిన వారు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కమిటీలలో సామాజిక న్యాయం జరిగిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News