న్యూఢిల్లీ: అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఏమాత్రం కృషి చేయలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం చేసిన ఆరోపణలకు దీటుగా కాంగ్రెస్ ఆనాటి లేఖను బయటపెట్టింది. ప్రాజెక్టు చీతా గురించి వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు 2009లో యూపీఎ ప్రభుత్వం రాసిన లేఖను కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆదివారం విడుదల చేశారు. యూపీఎ ప్రభుత్వంలో జైరామ్ రమేశ్ పర్యావరణం, అడవుల శాఖ మంత్రిగా పని చేశారు. ‘మన ప్రధాన మంత్రి అబద్ధాల కోరు. భారత్ జోడో యాత్రలో ఉండటం వల్ల శనివారం ఈ లేఖ గురించి చెప్పలేక పోయాను” అని జైరామ్ రమేశ్ ఆదివారం ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌తోపాటు 2009 నాటి లేఖను కూడా జత చేశారు. ప్రాజెక్టు చీతాకు నాంది ఈ లేఖ అని తెలిపారు. ప్రాజెక్టు చీతాకు పచ్చజెండా ఊపుతూఏ అప్పట్లో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖ ఇది. చీతాలను తిరిగి తీసుకురావడం కోసం సవివరమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఈ ట్రస్ట్ అధికారి డాక్టర్ ఎంకే రంజిత్ సింహ్‌ను ఈ లేఖలో కోరారు. 2010 జనవరి నెలాఖరుకు ఈ రోడ్‌మ్యాప్‌ను పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖకు సమర్పించాలని తెలిపారు. ప్రధాని మోడీ శనివారం నమీబియా నుంచి వచ్చిన చీతాలను కునో నేషనల్ పార్కులో ప్రవేశ పెట్టినప్పుడు గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం కృషి చేయలేదని ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే.
Congress shares 2009 letter on Project Cheetah