Thursday, January 23, 2025

సిత్రాలు.. చూడరో!

- Advertisement -
- Advertisement -
  • ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చిత్ర, విచిత్రాలు! 
  • టికెట్ రాక ఒకరు….టికెట్ వచ్చాక వద్దని మరొకరు…?
  • జాబితాలో పేరు ప్రకటించి….అనంతరం బి ఫాంలను వేరే వాళ్లకు ఇచ్చిన కాంగ్రెస్

(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ): ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. టికెట్ రాక ఒకరు బాధపడుతుంటే టికెట్ వచ్చిన వ్యక్తి నాకు ఈ టికెట్ వద్దంటూ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతోపాటు జాబితాలో పేరును ప్రకటించి చివరినిమిషంలో బి ఫాం మార్చిన ఘనత కూడా ఈ పార్టీకే దక్కడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సురేష్ షెట్కర్ పేరును ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

పార్టీ హైకమాండ్‌కు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. దీంతో అక్కడి నుంచి టికెట్ ఆశించిన సంజీవరెడ్డికి చాన్స్ లభించింది. స్వయంగా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు సంజీవరెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తానని, ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు. నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్లి మద్దతు పలుకుతానని తెలిపారు. నామినేషన్ చివరి రోజున ఊహించని తీరులో జరిగిన ఈ పరిణామాన్ని పార్టీ పెద్దలు కూడా స్వాగతించారు. కాంగ్రెస్ తరఫున ఆ స్థానంలో సంజీవరెడ్డి అధికారిక అభ్యర్థి అయ్యారు.

అభినందించిన పార్టీ నాయకత్వం
టికెట్ రాలేదని అసంతృప్తితో మదనపడుతూ పార్టీ మారడానికి సిద్ధమవుతున్న సమయంలో సురేష్ షెట్కర్ ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించింది. గతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి పార్టీ కేంద్ర నాయకత్వం సిద్ధమైనా స్వచ్ఛందంగా తనకు టికెట్ అవసరం లేదని, ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి చాన్స్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ ప్రకారం ఆ నియోజకవర్గంలో కసిరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం చేయడాన్ని, పరస్పరం సహకరించుకోడాన్ని పార్టీ నాయకత్వం సైతం అభినందించింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నారాయణఖేడ్‌లో సైతం మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఇలాంటి నిర్ణయం తీసుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

విలపించిన పటేల్ రమేష్‌రెడ్డి
చివరివరకు సూర్యాపేట నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి భంగపడ్డారు. సూర్యాపేట హస్తం పార్టీ టికెట్‌ను కాంగ్రెస్ హై కమాండ్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. టికెట్ రాకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి బోరున విలపించారు. ఆయన ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ రాకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

రెండో జాబితాలో పేరు, మూడులో మార్పు…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అభ్యర్థిగా మూడోజాబితాలో పేరు దక్కించుకున్న నీలం మధు ముదిరాజును అనూహ్యంగా మార్చి ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్‌ను ఎంపిక చేశారు. దీంతోపాటు రెండో జాబితాలో టికెట్ దక్కించుకున్న బోథ్ అభ్యర్థి వెన్నెల అశోక్, వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డిలను సైతం మూడో జాబితాలో మార్చి వనపర్తి నుంచి మేఘారెడ్డికి, బోథ్ నుంచి ఆదె గజేందర్‌లకు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజులు ఒకే సమయంలో తమ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం భారీ ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News