Sunday, September 29, 2024

గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడుగా మరికొన్ని గ్యారంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస గ్యారంటీలను ప్రకటిస్తున్నా వాటిపై తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఇంతవరకు సానుకూల స్పందన బహిరంగంగా కనిపించకపోవడం గమనార్హం. వార్తా మాధ్యమా లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పర్యవసానంగా మారుమూల గ్రామాలలోని ప్రజలకు సైతం విషయ పరిజ్ఞానం విరివిగా పెరిగింది. ఈ పరిణామాలతో ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతలు ఇచ్చే హామీలను ప్రజలు గతంలో వలే గుడ్డిగా నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదు.

హామీలు ఇచ్చే అధినేతల చారిత్రక నేపధ్యాన్ని కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు ప్రస్తుతం ఎక్కడా లేవు. హామీలు ఇచ్చేవారి నిబద్ధత, కార్యదక్షతతో పాటూ హామీల అమలులో సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తాము ఎవరి హామీలు నమ్మవచ్చో ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. అదే విధం గా గత నాలుగు దశాబ్దాలుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అమాంతం పెరిగింది. దీంతో బాధ్యతాయుతమైన స్థానిక రాష్ట్ర నాయకత్వ మాటకు ప్రజలు విలువఇచ్చే పరిస్థితి ఏర్పడింది. జాతీయ పార్టీలలో కూడా రాష్ట్ర స్థాయిల్లో ప్రజలను ప్రభావితం చేసే రాష్ట్ర నాయకులు ఒక్కరైనా వున్నప్పుడే ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు మనుగడ సాధించే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంతో పాటూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక లాంటి దక్షణాది రాష్ట్రాలలో గత నలభై సంవత్సరాలకు పైగా కొనసాగుతుండడం గమనార్హం. గత నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు తెలంగాణను ప్రాంతీయ పార్టీలే అత్యధిక కాలం పరిపాలించాయి. 2004, 2009 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించింది. 2004 ఎన్నికలకు ముందు అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పాదయాత్ర ద్వారా అన్నివర్గాల ప్రజలతో మమేకమయ్యారు.

ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి ప్రజలు పడుతున్న బాధలకు అనుగుణంగా వారికి అనేక హామీలు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి మాటలను విశ్వసించిన ప్రజలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. ఆ వరుస విజయాలకు కారకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కచ్చితంగా చెప్పవచ్చు. అదే విధంగా ఇటీవల కర్నాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో కర్నాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అయిదు గ్యారంటీలను హామీగా ఇచ్చింది. తాము ఇచ్చిన గ్యారంటీల వలనే కర్నాటక రాష్ట్ర ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించిందని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆ పార్టీ అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తున్న వరుస గ్యారంటీలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క గ్యారంటీల వలనే కర్నాటక ఎన్నికల్లో గెలిచామని భావించడం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అవగాహన రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తుంది.

తన అపార అనుభవంతో కర్నాటక రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయగలిగిన సిద్దిరామయ్య లాంటి నేతకు డికె శివకుమార్ లాంటి ఆర్ధిక పుష్టి కలిగిన నేత ఆ ఎన్నికల్లో తోడుగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అయిదు గ్యారంటీలను తాము అమలు చేస్తామని వారిరువురు రాష్ట్రమంతా కలియ తిరిగి ప్రజలకు గ్యారంటీ ఇచ్చారు. వారి ఇరువురి మాటలను విశ్వసించిన కర్నాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనేది అక్షరసత్యం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు వచ్చి హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాల పై ఇచ్చే హామీలను ప్రజలు పరిగణనలోకి తీసుకునే పరిస్థితి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో లేదు అనేది నిర్వివాదాంశం. ఆ పరిస్థితి ఇందిరా గాంధీతోనే ముగిసింది అని కచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గత దశాబ్ద కాలంగా, నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతుందనే వార్తలు దేశవ్యాప్తంగా బలంగా షికారు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందని గ్యారంటీ ఇప్పటి వరకు లేదు అని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే పార్లమెంటులో దానికి సహరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ.

అయినా కెసిఆర్‌కే రెండు దఫాలు తెలంగాణ ప్రజలు పట్టంకట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెస్, బిజెపిలకు మించిన స్థాయిలో కెసిఆర్ దశాబ్ద కాలం పైగా అలుపెరగని వీరోచిత పోరాటం చేశారు అనేది జగమెరిగిన సత్యం. అందువలనే తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్‌ను పేటెంట్‌గా భావించి తెలంగాణ ప్రజలు కెసిఆర్‌కు రెండు పర్యాయాలు అధికారం ఇచ్చా రు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అనేక మంది పేరుపొందిన నేతలున్నారు. కానీ వారిలో రాష్ట్ర స్థాయిలోని ప్రజలను ప్రభావితం చేయగలిగిన నిబద్ధత, అనుభవజ్ఞుడైన నేత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లేకపోవవడం రాష్ట్రంలో సత్ఫలితాలు సాధించడానికి లోటు గా కనిపిస్తుంది. ఈ పరిణామాల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను అమలుపరచే గ్యారంటీ ప్రాతిపదిక ఏందీ? గ్యారంటీ ఎవరు అనే ప్రశ్నలు తెలంగాణ ప్రజలలో మెదలుతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చెపుతున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఒక్కొక్కరికీ అయిదు లక్షల రూపాయలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఎలా సాధ్యమవుతుంది? 18 సంవత్సరాలు పైబడి చదువుకునే లక్షలాది మంది యువతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు విలువ చేసే ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఎలా సాధ్యమవుతుందో ఆర్ధికవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు.

అదే విధంగా రాష్ట్రాలలో రిజర్వేషన్లు 50% మించకూడదు అని ఇప్పటికే సుప్రీంకోర్టు క్లుప్తంగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా అనేక రాష్ట్రాల రిజర్వేషన్ అంశాలు అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎస్‌సిలకు 18%, ఎస్‌టిలకు 12% రిజర్వేషన్లు ఎలా కల్పిస్తుందో అంతుచిక్కడం అంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం అధికారాన్ని అనుభవించింది. ఆ సమయంలో అవకాశం ఉన్నా ఒక్క పర్యాయం కూడా బిసి నేతలకు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ కేటాయించ లేదు. ఈ విషయాలను విస్మరించి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పదేపదే బిసిల గురించి ప్రస్తావించడం కాంగ్రెస్ పార్టీకి బిసిలలో ఏ విధంగా మేలు చేస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయ పార్టీలు ఆమోదయోగ్యమైన, ఆచరణాత్మకమైన హామీలు ఇచ్చినప్పుడు మాత్రమే వాటి వలన పార్టీలకు లబ్ధి చేకూరుతుంది. అలాకాకుండా తాము ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారు అని ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తే అటువంటి పార్టీలు నవ్వుల పాలు కావడం ఖాయం.

కైలసాని శివప్రసాద్
9440203999

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News