ఖాళీ సిలిండర్లపై కూర్చుని మీడియా సమావేశం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. గురువారం పార్టీ అధికార ప్రతినిధులు ఖాళీ వంటగ్యాస్ సిలిండర్‌పై కూర్చుని మీడియా సమాశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గ్యాస్ ధరపై మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ క్రికెట్ పరిభాషలో హిందీలో ట్వీట్ చేశారు. ‘ మోడీ ప్రభుత్వ పిచ్ కోటీశ్వరులైన మిత్రులకు రెండు వైపులా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండగా, సామాన్యులకు మాత్రం అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో నిండి పోయి ఉంది’ అని దుయ్యబట్టారు. గత మూడు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.200లు పెరగ్గా, పెట్రోలు, డీజిలు ధరలు సెంచరీ కొట్టే దిశగా సాగుతున్నాయి అని ప్రియాంక పేర్కొన్నారు.
అనంతరం గ్యాస్ ధర పెంపునకు నిరసన తెలియజేయడానికి పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా షినాటె, కమ్యూనికేషన్ విభాగం కార్యదర్శి వినీత్ పునియాలు ఖాళీ సిలిండర్లపై కూర్చుని తమ నిరసన తెలియజేశారు. చివరికి మైక్‌ను కూడా ఖాళీ గ్యాస్ సిలిండర్‌పై పెట్టారు. వంటగ్యాస్ సిలిండర్లను తిరిగి నింపడం భరించే విధంగా లేదు కాబట్టి ఖాళీ సిలిండర్లను ఈ విధంగానూ ఉపయోగించుకోవచ్చంటూ ఈ సందర్భంగా షినాటే వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై మండిపడుతూ మోడీ ‘క్రికెట్ స్టేడియంలకు తన పేరు పెట్టించుకుంటున్నారు.అయితే ఆయన సాధించిన ఒకే ఒక సెంచరీ బహుశా పెట్రోల్ ధరేనేమో’ అని ఆమె అన్నారు. ధరలు పెంచుకుంటూ పోతున్నారే తప్ప ఎక్సైజ్ సుంకాలను ఎందుకు తగ్గించరంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె అన్నారు.