Saturday, December 21, 2024

ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇవ్వకపోతే రోడ్లెక్కుతాం

- Advertisement -
- Advertisement -

కశ్మీరు ప్రజలకు రాహుల్ భరోసా

జమ్మూ: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్మూ కశ్మీరుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించని పక్షంలో పార్లమెంట్‌లో ఇండియా కూటమి తన పూర్తి బలాన్ని ప్రదర్శించడమేగాక ఆందోళన చేపడతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. బుధవారం నాడిక్కడ పార్టీ అభ్యర్థుల తరఫున ఒక న్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ 2019లో ఇదివరకటి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(యుటి) విభజించిన సమయంలో జమ్మూ కశ్మీరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలన్న తన డిమాండును ఆయన పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర హోదాను లాగేసుకుని ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్డం భారతదేశ చరిత్రలో ఎన్నడూ సంభవించలేదని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించని పక్షంలో పార్లమెంట్ ఉభయ సభలలో తమ ఇండియా కూటమి పూర్తి బలాన్ని ఉపయోగిస్తుందని, అవసరమైతే రోడ్లపైకి వస్తామని ఆయన హామీ ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కశ్మీరు నుంచి రాష్ట్ర హోదాను లాగివేశారని ఆయన ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నంత వరకు బయటి వ్యక్తులు లబ్ధి పొందుతారని, స్థానికులను పక్కనపెడతారని రాహుల్ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీరును స్థానికులకు బదులుగా బయటి వ్యక్తులు నడిపించాలన్నది కేంద్రంలోని బిజెపి ఆలోచనగా ఆయన అభివర్ణించారు.

రాష్ట్ర హోదా పునరుద్ధరణ మీ హక్కు.. మీ భవిష్యతు..అది లేకుండా జమ్మూ కశ్మీరు అభివృద్ధి సాధించలేదు అని రాహుల్ తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలపై ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం అంబానీ, అదానీల కోసం పనిచేస్తోందని, వారికి మార్గాన్ని సుగమం చేసేందుకు జిఎస్‌టి, పెద్ద నోట్ల రద్దును ఆయుధాలుగా కేంద్రం ఉపయోగించిందని ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మేక్ ఇన్ అదానీ కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ విధానం కింద అన్ని కాంట్రాక్టులను అదానీ కంపెనీకి కట్టబెడుతున్నారని రాహుల్ ఆరోపించారు. జమ్మూ కశీరుకు కేంద్ర స్థానమైన జమ్మూ వెన్నెముకను బిజెపి ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ విరగ్గొడుతున్నారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News