మంత్రి దామోదర రాజనర్సింహ
వర్గీకరణ కలను నెరవేర్చిన
మంత్రిని కలిసి కృతజ్ఞతలు
తెలిపిన ఎపి మాదిగ,మాదిగ
ఉపకులాల సంఘాల నాయకులు
మనతెలంగాణ/హైదరాబాద్ : మాదిగలు కోరుతున్న వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2005లోనే వైఎస్‌ఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు. దశాబ్దాల ఎస్‌సి వర్గీకరణ కలను నెరవేర్చిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాదిగ,మాదిగ ఉపకులాల సంఘాల నాయకులు శనివారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎపిలోనూ వర్గీకరణకు సహకరించాలని, తమకు మార్గనిర్దేశిగా నిలవాలని కోరిన ఎపి నాయకులు కోరగా, తాను అన్ని విధాలా సహరిస్తానని మంత్రి ఇచ్చారు.
ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, వర్గీకరణలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతులను, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మంత్రి వివరించారు. 2023లో అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు సిఎం రేవంత్ రెడ్డి సీనియర్ న్యాయవాదులను నియమించారని తెలిపారు. మేధావులు, నాయకులను తీసుకుని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వర్గీకరణ కేసు విచారణను పరిశీలించి, అవసరమైన సూచనలు చేస్తూ వచ్చామని చెప్పారు. గతేడాది ఆగస్ట్ 1న కోర్టు తీర్పు వచ్చిన అరగంటలోనే అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా సిఎంతో ప్రకటన చేయించుకున్నామన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి తమకు అండగా నిలిచారని, సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన 4 నెలల్లో వర్గీకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని వివరించారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసుకుంటున్నామని, ఏ కులాలను ఏ గ్రూపులో వేయాలో, ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ఎంపరికల్ డాటా ఆధారంగా జ్యుడీషియల్ కమిషన్ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. మాలలు, మాదిగలు, ఇతర అన్ని కులాలకూ న్యాయం చేసేలా కమిషన్ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఇంకా సమస్యలు సృష్టించి, వర్గీకరణ ఫలాలు అందకుండా చేసుకోవద్దని కోరారు. వర్గీకరణ విజయాన్ని ప్రతి ఇళ్లు విజయోత్సవం చేసుకోవాలని, ప్రతి ఊర్లో సంబురాలు జరపాలని పిలుపునిచ్చారు.