రాంచి: భారీ నగదుతో పశ్చిమ బెంగాల్ పోలీసులకు పట్టుబడ్డ జజార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై వేటు పడింది. ఆ ముగ్గురిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. తమ వాహనంలో భారీ నగదుతో వెళ్తున్న ఎంఎల్‌ఎలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిశ్వాల్ కొంగరిలు పశ్చిమ బెంగాల్‌లోని రాణిహటి వద్ద శనివారం రాత్రి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరినుంచి రూ.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంఎల్‌ఎలతో పాటుగా డ్రైవర్‌ను, మరో అనుచరుడిని కూడా అరెస్టు చేసినట్లు హౌరా రూరల్ ఎస్‌పి స్వాతి భంగాలియా చెప్పారు. దాదాపు 24 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత ఎంఎల్‌ఎలను అరెస్టు చేసినట్లు ఎస్‌పి తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు నగదుతో పట్టుబడడం జెఎంఎంకాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అవినీతికి నిదర్శనమని బిజెపి ఆరోపించింది.
‘ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను తక్షణమే సస్పెండ్ చేస్తూ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. వీరి సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తుంది’ అని జార్ఖండ్ పార్టీ ఇన్‌చార్జి అవినాశ్ పాండే వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరి సమాచారం తమ వద్ద ఉందన్న ఆయన ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తప్పవన్నారు. ఇదిలా ఉండగా ఎంఎల్‌ఎల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడినుంచి వచ్చిందో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది.రాష్ట్రంలో జెఎంఎంకాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం అవినీతికి ఇది నిదర్శనమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ అవినీతిపై దర్యాప్తు జరపాలని బెంగాల్ బిజెపి సీనియర్ నేత దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. మరోవైపు జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ఈ నగదు పట్టుబడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
Congress Suspends 3 Jharkhand MLAs Catch with Cash