జైపూర్ : అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు కాంగ్రెస్ చిహ్నంగా ఉంటోందని, ఈ మూడు చెడు లక్షణాలే దేశం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నాయని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. రాజస్థాన్ బారన్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు నీతి నియమాలకు కట్టుబడి ఉండరని, అధికార పార్టీ దోపిడీదారులకు, అక్రమార్కులకు, నేరస్థులకు పాలన అప్పగించడంతో రాష్ట్ర ప్రజలు అనేక బాధలకు గురవుతున్నారని ఆరోపించారు.
ఈ మూడు చెడు లక్షణాల శత్రువులు మనలో ఉన్నంత కాలం అభివృద్ధి చెందిన దేశంగా నెరవేర్చడం కష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు నుంచి కాంగ్రెస్ లోని ప్రతివారూ నీతినియమాలకు కట్టుబడని వారేనని అందువల్లనే ప్రజలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. “గెహ్లాట్ జీ మీరు ఓట్లు సంపాదించలేరు” అని ఈ రోజు రాజస్థాన్ లోని పిల్లలు కూడా అంటున్నారని ఎద్దేవా చేశారు.
రాజస్థాన్ లోని శాంతిభద్రతల పై కూడా మోడీ ధ్వజమెత్తారు. చెల్లెళ్లు, కుమార్తెల పాలిట అక్రమాలు, అఘాయిత్యాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారికి అండగా మంత్రులు ఉంటున్నారని ఆరోపించారు. మహిళా సంక్షేమం, భద్రతే బీజేపీ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతు కారణం గానే రాజస్థాన్‌లో సంఘ వ్యతిరేక శక్తుల మనోబలం ఎక్కువని వ్యాఖ్యానించారు.