కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జోరు షురూ!
అభ్యర్థులను ప్రకటించకుండానే ఆశావహుల ప్రచారం మొదలు?
ఉమ్మడి జిల్లాలో ప్రచారం భారీగా నిర్వహిస్తున్న టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు
టిపిసిసి భారీగా ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్: అధిష్టానం అభ్యర్థులను ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జోరందుకుంది. పలు జిల్లాలోనూ ఆశావహులు ప్రచారం మొదలుపెట్టడంతో టికెట్ ఎవరికీ దక్కుతుందో తెలియక స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరి తరపున ప్రచారంలో పాల్గొనాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో అధికంగా కనిపిస్తుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఫిర్యాదులు అందుతున్నట్టుగా తెలిసింది.
కొన్ని నియోజకవర్గాల్లో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా ఆశావహులు ప్రచారం నిర్వహించడంతో స్థానిక నాయకులకు విస్మయానికి గురవుతున్నారు. ప్రస్తుతం పలు జిల్లాలో కాంగ్రెస్ ఆశావహులు ప్రచారం భారీగా నిర్వహిస్తుండడంతో బిఫాం దక్కించుకునే నాయకులు ఎవరన్న విషయం క్యాడర్‌లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి అధికంగా ఫిర్యాదులు అందగా వాటిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సర్ధి చెప్పడానికి నానాతంటాలు పడుతున్నట్టుగా సమాచారం. త్వరలోనే మొదటి జాబితాను విడుదల చేస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది.
పారిజాత తీరుపై పార్టీ శ్రేణుల ఆగ్రహం
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం టికెట్ తనకే వచ్చిందని పేర్కొంటూ మేయర్ పారిజాత ప్రచారం మొదలుపెట్టారు. పారిజాతకు మద్దతు తెలపాలని కోరుతు మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఆ నియోజకవర్గ ప్రజలకు ఫోన్లకు మేసెజ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐసిసి, పిసిసి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే సొంతంగా తానే అభ్యర్థినని ప్రచార రథం వేసుకొని పారిజాత తిరుగుతున్నారు. పారిజాత తీరుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులే ప్రకటించకపోయినా ఈ ప్రచార సభలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ నాయకులు సీరియస్ అవుతున్నారు.
పారిజాత ప్రచారం సోషల్ మీడియాలో వైరల్
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఆమెకు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. అయితే మంత్రి సబితతో మేయర్‌కు కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్లుగా సమాచారం. సబిత తీరుతో మనస్తాపం చెందిన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే పారిజాత ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.