న్యూఢిల్లీ :పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ బీజేపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనెల 12 న దేశ వ్యాప్తంగా మౌన సత్యాగ్రహం చేపట్టనున్నది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో గాంధీ విగ్రహాల ముందు పార్టీ కార్యకర్తలు , నేతలు మౌనసత్యాగ్రహం చేపడతారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ బలంగా తన గళం వినిపిస్తున్నారని,
భారత్ జోడో యాత్ర అద్భుతమైన విజయం సాధించిన తరువాత లోక్‌సభలో రాహుల్ చారిత్రక ప్రసంగం చేశారని, మోడీకి, అదానీ గ్రూపుకు ఉన్న అనుబంధాన్ని వెలికి తీశారని అన్నారు. దీంతో బీజేపీ నీచ రాజకీయాలతో రాహుల్‌ను పార్లమెంటు లోకి అడుగుపెట్టకుండా అనర్హత ఓటు వేసిందని ఆరోపించారు. దీనికి నిరసనగా 12న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ రాష్ట్ర విభాగాలు మహాత్మా గాంధీ విగ్రహాల ముందు మౌన సత్యాగ్రహం పాటిస్తారని చెప్పారు.