న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఈ నెల14నుంచి 15 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమం నిర్వహించనుంది. బుధవారం విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదరులు కెసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా ఈ విషయం తెలియజేశారు. ధరల పెరుగుదల కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తోందని, ప్రజల కష్టాలను మరింత పెంచుతోందని వేణుగోపాల్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం, మాంద్యం పెరిగిపోవడం, గతంలో ఎన్నడూ లేని విధంగాపెరిగిపోయిన నిరుద్యోగిత రేటు, వ్యవసాయ సంక్షోభం, పెరిగిపోతున్న పేదరికం, ఆకలి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. కాగా గత ఏడాది కాలంలో ఆవనూనె, ఇతర ఖాద్య తైలాల ధరలు రెట్టింపు అయ్యాయని సుర్జేవాలా ఆరోపించారు. వెన్ను విరుస్తున్న ధరల పెరుగుదల, కనీవినీ ఎరుగని స్థాయికి చేరిన నిరుద్యోగిత, ఉద్యోగాలు కోల్పోవడం కారణంగా సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
ఒక్క కొవిడ్ సమయంలో 14 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని , రోజువారీ కూలీలు, వేతన జీవులు 50 శాతం వేతనాల కోతలను ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కాగా ‘జనజాగరణ్ అభియాన్’గా పిలవబడే ఈ ఆందోళన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వీలయినంత ఎక్కువ మంది వద్దకు చేరుకుని పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల వాణిని బలోపేతం చేస్తారని మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎఐసిసి ‘జనజాగరణ్ అభియాన్’ లోగోను కూడా విడుదల చేస్తుందని, ధరల పెరుగుదలకు సంబంధించిన వాస్తవాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారం రోజలు పాటు పాదయాత్రలు నిర్వహిస్తారని, రాత్రుళ్లు గ్రామాలు, పట్టణాల్లో బస చేసి ప్రజలను కలుసుకుంటారని దిగ్విజయ్ చెప్పారు. దీనికోసం ఈ నెల 12నుంచి 15 వరకు మహారాష్ట్రలోని సేవాగ్రామ్, వార్ధాలలో రాష్ట్రస్థాయి శిక్షకుల కోసం ఎఐసిసి ఒక శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహిస్తుంది.