లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆదాయం పన్ను శాఖ(ఐటి) కాంగ్రెస్‌కు రూ. 1,800 మేర పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేయడాన్ని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా, పన్ను ఉగ్రవాదంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. దీనికి వ్యతిరేకంగా మార్చి 30, 31 తేదీలలో(శనివారం, ఆదివారం) దేశవ్యాప్తంగా నిరసలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఐటి శాఖ నుంచి తమకు తాజా నోటీసులు అందాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు. దీనికి నిరనసగా దేశవ్యాప్తంగా శనివారం, ఆదివారం అన్ని రాష్ట్ర రాజధానులు,
జిల్లా ప్రధాన కార్యాలయాలలో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి)లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి బిజెపి ఒక పథకం ప్రకారం పనిచేస్తోందని పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నాయకులు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు రాసిన లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు, అన్ని జిల్లాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన కోరారు.