పిసిసి చీఫ్ రేవంత్ ఇంటివద్ద బాహాబాహీ
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈక్రమంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో పాటు రాళ్లు, కర్రలు విసురుకున్నారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు టిఆర్‌ఎస్ కార్యకర్తలు యత్నించారు. గత కొన్ని రోజులుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతు న్న విమర్శలు, ప్రతి విమర్శలే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి దారితీసింది. రేవంత్ రెడ్డి మంత్రి కెటిఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు మాదక ద్రవ్యాలు వాడలేదని పరీక్షలు చేయించుకోవాలని వైట్ ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయనపై మంత్రి కెటిఆర్ పరువు నష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలో కొంతమంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయన దిష్టిబొమ్మతో నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రేవంత్ రెడ్డి ఇంటిని తెరాస కార్యకర్తల ముట్టడి నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన నివాస పరిసరాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. 200మీటర్ల దూరం వరకు ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
రేవంత్‌కు తగిన గుణపాఠం చెబుతాం: టిఆర్‌ఎస్‌వి
పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ విద్యార్థి నేతలపై దాడి చేయించడం పిరికిపంద చర్య అని టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లపై వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థి నేతలపై దాడులకు పాల్పడడం సరికాదని ఆయన హితవు పలికారు. అదే తీరును తాము కొనసాగిస్తే రేవంత్‌రెడ్డి గడప కూడా దాటలేడని హెచ్చరించారు. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను రెచ్చగొడితే అధికారంలోకి వస్తానని కలలు కంటున్న రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.