రాష్ట్ర యంత్రాంగాన్ని బిజెపి దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ శనివారం ఎన్నికల సంఘాన్ని కోరింది. తద్వారా ప్రవర్తన నియమావళి అమలులోకి రాగలదని కోరుకుంటోంది. అక్కడి రాష్ట్ర యంత్రాంగాన్ని అధికారంలో ఉన్న బిజెపి దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఇంతేకాక హిమాచల్ ప్రదేశ్‌లో ‘అమృత్‌మహోత్సవ్’ వేడుకలను కూడా నిషేధించాలని కోరింది. బిజెపి కాలపరిమితి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉందనగా, ఆ పార్టీ బాహాటంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తోందని నిందించింది. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఓ ప్రకటనలో ఈ ఆరోపణలు చేశారు.
బిజెపి కేంద్ర మంత్రులు, నాయకుల ఆతిథ్యం కోసం కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దుర్వినియోగాన్ని ఎన్నికల సంఘం ఓ నేరం కింద భావించి దీనిని వెంటనే ఆపుచేయలని, అంతేకాక అసెంబ్లీ ఎన్నికలకు తేదీని కూడా ప్రకటించాలని, ప్రవర్తనా నియమావళిని వెంటనే అమలులోకి తేవాలని ఆమె కోరారు. “అమృత్ మహోత్సవ్ పేరిట ప్రభుత్వ వేడుకలలో బిజెపి పార్టీ జెండాలను ప్రదర్శిస్తోంది” అని కూడా ఆమె ఆరోపించారు. మంచు కురిసే గిరిజన జిల్లాలు…లాహౌల్-స్పితి, కిన్నౌర్ సహా రాష్ట్రంలోని ఎతైన ప్రాంతాలలో కూడా ఒకేసారి(సైమల్టేనియస్‌గా) ఎన్నికలు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.