న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై మొత్తం దేశం ఆందోళనలను పరిహరించేందుకు ఇవిఎంలను కాకుండా బ్యాలట్ పత్రాలను వినియోగించాలన్న తన మిత్రుడు, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ శనివారం విజ్ఞప్తి చేసింది. సమస్త ప్రపంచం చెబుతున్న విషయాన్ని అధికార బిజెపి ఎందుకు పెడచెవిని పెడుతోందని, దాని ప్రభుత్వం పారదర్శకతకు దూరంగా ఎందుకు వెళుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్ ప్రశ్నించారు. ‘బ్యాలట్ పత్రాలు, ఒకే రోజు వోటింగ్‌పై తన అత్యుత్తమ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ సందేశాన్ని ప్రధాని మోడీ పట్టించుకుని, మన ఎన్నికల ప్రక్రియ సమగ్రత గురించి సమస్త దేశం ఆందోళనలను పరిహరిస్తారా?’ అని వేణుగోపాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ప్రశ్నించారు.
గవర్నర్ల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలను వేణుగోపాల్ ఉటంకిస్తూ, ‘మహారాష్ట్రలో అకస్మాత్తుగా లక్షలాది మంది వోటర్ల చేర్పు లేదా ప్రతిపక్ష వోట్ల లక్షిత తొలగింపు విషయమై ఆయన ప్రియతమ మిత్రుడు కూడా కలవరపడతారని నా నమ్మకం’ అని తెలిపారు. బ్యాలట్ పత్రాలు, ఒకే రోజు వోటింగ్ విధానానికి తిరిగి వెళ్లాలని, వోటింగ్ యంత్రాలు వ్యయభరితమని ట్రంప్ ఆ సమావేశంలో గవర్నర్లతో సూచించారు. ఇవిఎంలు లోపభూయిష్టమని ఏ ఒక్కరూ నిరూపించలేకపోయారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తున్నప్పటికీ బ్యాలట్ పత్రాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. బ్యాలట్ పత్రాల విధానానికి తిరిగి వెళ్లేది లేదని ప్రభుత్వం కూడా పార్లమెంట్‌లో పదే పదే స్పష్టం చేసింది.