Friday, December 27, 2024

‘ఎజెండా 2025’… ఓ సవాల్/చాన్స్!

- Advertisement -
- Advertisement -

రాజకీయాల్లో సవాల్ అనిపించేది ఓ చక్కని అవకాశమవుతుంది. ఓ మంచి అవకాశంగా కనిపించేది సవాల్ అయి నిలిస్తుంది. అటువంటి అనిశ్చితిలో… సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఎప్పుడు దేన్ని ఎలా మలచుకుంటారు అన్నదాన్ని బట్టే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇది పలుమార్లు రుజువైన సత్యం. అసెంబ్లీకి ఎన్నికలు జరిగి, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా… తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉంది. గాలివాటు రాజకీయాలే తప్ప ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఎవరూ నడపట్లేదు. గ్రామ పంచాయతీలు, మండలజిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో సంస్థాగతంగా మూడు ప్రధాన పార్టీల సన్నద్ధత అంతంత మాత్రమే! నవీకరించిన ఓటర్ల జాబితాలు సిద్ధమై, రిజర్వేషన్లు ఖరారయితే… ఫిబ్రవరిలో ఈ ఎన్నికలకు ఆస్కారముంది. 2023 24 ఫలితాలు, పరిణామాలు, పరిస్థితులను సమీక్షించుకొని 2025 కు కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన తరుణంలో… ఎవరి పరిస్థితి ఏమిటి? ఓ సింహావలోకనం! రాజకీయ పార్టీలకు ఏడాదుల కాలపు సరిహద్దులేముంటాయనే సందేహం రావొచ్చు! కాలరేఖలు సంకెళ్లు కావేమో కానీ, పార్టీలు సమీక్షకు సిద్ధపడితే… రెండు ముఖ్య ఎన్నికలు ముగిసి, మూడో ఎన్నికలకు వెళుతుండటం ఓ మైలు రాయే!
మారకుంటే మారదంతే!
ఉద్యమం నుంచి పుట్టిన ప్రతిపక్ష పాత్రకి, పదేళ్లు అధికారం అనుభవించిన తర్వాతి ప్రతిపక్ష పాత్రకి తేడా ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని భారత్ రాష్ర్ట సమితి బిఆర్‌ఎస్ గ్రహించాలి. ఒక విమర్శ చేసే ముందు, అదే విషయంలో ‘పదేళ్లు మనమేం చేశాం?’ అని ప్రశ్నించుకోవాలి. రాజకీయంగా కాక, నిజాయితీగా ప్రజాపక్షం వహిస్తే… లేవనెత్తాల్సిన అంశాలు, ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన విషయాలు, విపక్షం దెబ్బకు ప్రభుత్వం తప్పుదిద్దుకొని ప్రజలకు మేలు కలిగించాల్సిన విధానాలు వేరుంటాయి. వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాల్లో నిందిస్తూ ఉంటే, ‘ఇక దిగిపోండి, దిగిపోండి, మేమొచ్చి కూర్చుంటాం…’అన్నట్టు ప్రవర్తిస్తే దాన్ని ప్రజలు మెచ్చరు. ఎన్నికల్లో ఓడించి, తెలంగాణ సమాజం ప్రతిపక్ష బాధ్యత అప్పగించి ఏడాదయినా.. బిఆర్‌ఎస్ సమర్థంగా ఆ పాత్ర పోషించలేకపోతోందనే భావన ప్రజల్లో ఉంది. అది పోయేలా నడచుకోవాల్సిన బాధ్యత బిఆర్‌ఎస్‌దే! 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన చేదు అనుభవం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కాలడం… ఎందుకు జరిగింది? అన్న లోతైన, నిజాయితీ సమీక్ష ఇంతవరకూ జరుగలేదు. జాతీయ పార్టీ అంటూ నేలవిడిచి సాము చేయడం, తప్పులు అంగీకరించని స్థితి, విమర్శలు సహించని అసహనం, నియంతృత్వ పోకడ… వల్ల పదేళ్లు మధ్యంతర దిద్దుబాటు లేకుండాపోయింది. ఈ ఆత్మశోధన లేక, ప్రజాసంబంధ విషయాల్లో ఇప్పుడు ఎలా నడచుకోవాలో వారికి బోధపడుతున్నట్టు లేదు. పార్టీ అధినేత చంద్రశేఖరరావు అటు ప్రజాక్షేత్రానికో, ఇటు అసెంబ్లీకో రాకపోవడం ఒక లోపమే! పార్టీ శాసన సభాపక్ష కార్యవర్గాన్ని ఖరారు చేయకపోవడంతో… సర్కారుకు గట్టిగా అడ్డుతగులుతున్న హరీశ్‌రావును, ‘ఇంతకీ నీది ఏ హోదా?’ అని, పాలకపక్షం ఎకసక్కాలాడే పరిస్థితిని పార్టీయే కల్పిస్తోంది. ‘కాళేశ్వరం నుంచి ఫార్ములా ఈ రేస్’ దాకా బిగుస్తున్న పలు కేసుల ఉచ్చు.. ఎక్కడిదాకా పోతుందో తెలీదు. రెండు వరుస ఓటముల తర్వాత నిస్తేజంగా మారిన పార్టీ పునర్నిర్మాణం జరగాలి. ‘ఇక బిఆర్‌ఎస్ పని అయిపోయింది’ అనే మౌఖిక ప్రచారం పెరిగితే, ఆ రాజకీయ శూన్యతలోకి బిజెపి విస్తరించే ఆస్కారం బలంగా ఉంది. ఆ పరిస్థితిని అధిగమించి, పార్టీకి పూర్వవైభవం తేవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు వారికొక మంచి అవకాశం. అదే వారి ఎజెండా 2025!
జనంలోకి వెళితేనే జరుగుబాటు
‘కలలు కనడానికి నిద్రపోవాలి, వాటని సాకారం చేసుకోవడానికి మాత్రం మేల్కొనాలి’ అన్నది పెద్దల మాట! దాని సారాన్ని తెలంగాణ బిజెపి గ్రహించాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి, నాయకత్వ స్థానాల కోసం రాష్ర్ట నేతలు ఒకరికాళ్లు వేరొకరు లాక్కుంటున్నారు. రాష్ట్రాధ్యక్ష స్థానం కోసం పాతకొత్త స్పర్థతో నాయకులు పోటీపడటమే కాకుండా, పరస్పర హననానికీ వెనుకాడటం లేదు. ‘పార్టీలో ఐక్యత లోపించి, అధికారంలోకి రావాల్సిన చోట స్వయంకృతాపరాధంతో ఓడిపోయార’ని చివరకు పార్టీ అగ్రనేత, ప్రధానితో చివాట్లు తినాల్సి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితమొక ‘భంగపాటు’ అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితం, 4 నుంచి 8 స్థానాలకు ఎదుగుదలే అయినా… ఆశించిన సంఖ్య దక్కని కంటితుడుపే! ‘గెలిచిన 8 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కలిపితే 88, కనుక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మాదే!’ అన్నట్టు భావిస్తున్న నాయకులు కలల్లో విహరిస్తున్నారు. హర్యానా, మహారాష్ర్ట గెలుపు సంబరాలే తప్ప, వాటి ప్రత్యక్ష ప్రభావం తెలంగాణలో ఉండాలంటే సంస్థాగతంగా బలపడాలనే గ్రహింపు రాష్ర్ట నాయకత్వానికి వస్తున్నట్టు లేదు. గత ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థుల్లో 40 శాతం పార్టీని వీడి వెళ్లారంటే, ఎవరెవరికి టిక్కెట్లు దక్కాయో… తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు! అగ్రనేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డా.లక్ష్మణ్, ఈటెల తదితరుల నియోజక వర్గాల పరిధిలోనూ మంచి ఫలితాలు రాలేదు. ‘ఎన్నికలు ముంచుకొస్తుంటే, ఆపద్ధర్మంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసినట్టు ప్రధానే స్వయంగా వెల్లడించారు. కానీ, ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడిని నియమించకపోవడానికి రాష్ర్ట నాయకత్వంలో నెలకొన్న అనారోగ్యకర పోటీయే కారణం. తనకు అనుకూలంగా, సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ ఏదో రాయించుకున్నట్టు ఢిల్లీ వరకు ప్రచారం వెళ్లడం వల్లే, ‘పోటీలో నేను లేను’ అని ఆయనే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమించుకోవడం, సయోధ్యతో అందర్నీ ఒకతాటిపైకి తెచ్చుకోవడం, స్థానిక ఎన్నికలను పార్టీ బలోపేతానికి వేదిక చేసుకోవడం… ఇవన్నీ ఎజెండా 2025 సవాళ్లే!
సంసారం మొదలవాలి
దంపతుల మధ్య చనువు, సఖ్యత పెరగటానికి ‘హనీమూన్’ టానిక్‌లా పని చేస్తుంది. కానీ, అదే దాంపత్య జీవితం అవదు! ఎక్కడో ఓ చోట హనీమూన్ ముగిస్తే, అసలు సంసారం మొదలవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన హనీమూన్ ముగిసిందని గ్రహించాలి. సర్కారు ఏర్పడి ఏడాది ముగిసినా 2023 విజయోత్సవ మత్తులోంచి నాయకత్వం ఇంకా బయటపడుతున్నట్టు లేదు. సన్మాన సత్కార సంబరాల సందడే సాగుతూ ఉంది. పట్టుతో పాలన గాడిన పడటం లేదు. మంత్రుల మధ్య సమన్వయం, శాఖల వారీగా సమీక్షలు, హామీలు విధానాల అమలు, పాత ప్రభుత్వాన్ని మరిపించేలా కొత్త సర్కారు తనదైన ముద్ర వేయడం… ఇవేవీ బలంగా వేళ్లూనుకోలేదన్నది జనాభిప్రాయం. ప్రభుత్వం ‘ఉమ్మడిగా’ పనిచేస్తున్న భావన రావట్లేదు, తక్కువ సమయంలోనే ప్రజాక్షేత్రంలో ‘గుడ్‌విల్’ కరిగిపోయింది. శాసనసభ సమావేశాల్లో హాజరీ కూడా గొప్పగా లేదు. ‘విప్’ల సమన్వయం అంతంతే! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీసిఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అప్పుడప్పుడు రవాణా బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తప్ప సభా వ్యవహారాలను మంత్రిర్గం ప్రభావితం చేస్తున్న జాడలు లేవు. తగు సన్నద్ధత లేకనేమో, పలు విషయాల్లో విపక్షమే ఆధిక్యత సాధిస్తోంది, సర్కారు వారిని సమర్థంగా ఎదుర్కొంటున్న సంకేతాలు రావట్లేదు. ఇక కెసిఆర్ సభకు వస్తే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న సహజం. కొత్త పిసిసి నేత, కొందరు నాయకులకు పదవులు వచ్చాయి తప్ప పార్టీపరంగా పెద్ద మార్పు లేదు. పిసిసి కొత్త కార్యవర్గం ఏర్పడలే, సిఎల్‌పి కార్యవర్గం రూపుదాల్చలే! మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి పగ్గాలు చేపట్టి వంద రోజులవుతున్నా ఆయనదైన పనితీరు ఇంకా మొదలైనట్టు లేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో పనులు జరగట్లేదన్న అసంతృప్తి మొదలైంది. నాయకుల ఇళ్ల దగ్గర, వారి ఆఫీసుల్లో సందడి మాత్రం తగ్గలేదు. ఏం చేసినా రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలోపేతం కావట్లేదు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు ఒకటైనా దక్కలేదు, వారిచ్చిన పిలుపుల ప్రకారం కనీస కార్యక్రమాలు కూడా విజయవంతం కావట్లేదు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల ప్రభావమేమో… రాష్ర్ట పార్టీ నేతల కేరళ పర్యటనలూ పెరిగాయి. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి… తెలంగాణలో మూడు పార్టీలకూ 2025కు నిర్దిష్ట ఎజెండా ఉంది. సవాళ్లను అవకాశంగా మలచుకుంటూ, ఎజెండా 2025 సాధించుకుంటే తప్ప 2028 కి బాటపడదు. పయనం అటైనా, ఇటైనా… చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!.

దిలీప్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News