జెఎంఎం ముడుపుల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. చట్టాన్ని సరిచేయడం వాంఛనీయమేనని, అయితే ఈ పని ఎప్పుడో చేసి ఉండవలసిందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇది చాలా సంవత్సరాలుగా సరిచేయకుండా అపరిష్కృతంగా ఉన్న చట్టపరమైన అంశమని, ఇది రాజ్యాంగపరమైన అంశం కాదని కాంగ్రెస్ అథికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి సోమవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ఇది అభినందనీయ, వాంఛనీయ, స్వాగతించతగ్గ తీర్పని ఆయన అన్నారు.
చట్టాన్ని సరిచేసే ఈ తీర్పు ఎప్పుడో వచ్చి ఉండవలసిందని ఆయన చెప్పారు. ఈ కేసులోని మంచి చెడ్డలను ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదని, ఈ తీర్పు ఎవరికైనా ముడుపులు ముట్టాయా లేదా అన్న విషయమై వచ్చిన తీర్పు కాదని ఆయన తెలిపారు. ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన వారిలో కొందరు ఓటు వేస్తారని, కొందరు ఓటు వేయరని, అసలు వారిపైన చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉందని, ఇప్పుడు ఈ తీర్పుతో అది నివృత్తి అయిందని సింఘ్వి అన్నారు.