Monday, December 23, 2024

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేట మండలం బోజ్యనాయక్ తండా, బానోజీపేట, చంద్రయ్యపల్లె, రాజేశ్వర్‌రావుపల్లె గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ వల్ల యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు.

కోటి రతనాల వీణ నా తెలంగాణ లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు, సకల జనుల అభీష్టం మేరకు సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికొక ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య, రైతు రుణమాఫీ, రైతులకు పంట రుణాలు, రైతులకు పట్టాలు, పోడు భూములకు పట్టాలు, గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, నిరుద్యోగ భృతి లాంటి పథకాలు ఇస్తానని నమ్మించి కేసీఆర్ తెలంగాణ ప్రజల గొంతు కోశారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, అర్హులైన పేదలకు రూ. 5 లక్షలతో ఇళ్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉద్యోగ నోటిఫికేషన్లు, తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్లు, యువతకు ఉపాధి అవకాశాలు, పంటకు గిట్టుబాటు ధర, నిరుద్యోగ భృతి లాంటి పథకాలతో పేదరిక నిర్మూలన లక్షంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News