Monday, December 23, 2024

కర్నాటకలో కాంగ్రెస్ విజయం వెనుక..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏ ఎన్నికల్లోనైనా ఒక పార్టీ విజయం సాధించాలంటే అభ్యర్థుల ఎంపిక మొదలుకొని పోలింగ్ తీరు అధ్యయనం, ప్రచార వ్యూహం లాంటివన్నీ చాలా ముఖ్యం. ఇవన్నీ సక్రమంగా ఉంటే గెలుపు సునాయాసం అవుతుంది. తాజాగా ముగిసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ పని చేశాయి కాబట్టే ఆ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే దీని వెనుక 41 ఏళ్ల యువకుడు, పెద్దగా ప్రచారాన్ని కోరుకోని రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర చాలా ఉంది. టికెట్ల పంపిణీనుంచి ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయ్యేదాకా ఓటర్ల సమీకరణ వరకూ అన్నీ తానే అయి పర్యవేక్షించారు. మిస్ కెగా పరిచితుడైన సునీల్ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ స్ట్రాటజిస్టు. కర్నాటకలోని బళ్లారిలో పుట్టిన సునీల్ ఆ తర్వాత చదువు కోసం చెన్నైకి మకాం మార్చారు.తర్వాత అమెరికా వెళ్లి ఎంబిఎ చదివారు.

ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కనన్సల్టెన్సీ మెకన్సీలో పని చేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత గుజరాత్ రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా పని చేశారు.‘ ది అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’కు చీఫ్‌గా పని చేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వ్యూహకర్తల్లో సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత బిజెపి కోసం యుపి ఎన్నికల్లో పని చేశారు.తర్వాత తమిళనాడులో డిఎంకె, అన్నా డిఎంకె కోసం కూడా పని చేశారు.2019లో తమిళనాడులో స్టాలిన్ కోసం పని చేసిన సునీల్ రాష్ట్రంలో 38 పార్లమెంటు స్థానాలు డిఎంకె గెలుచుకునేలా కృషి చేశారు. ఈ ఎన్నికలే తమిళనాడులో స్టాలిన్‌ను తిరుగులేని నేతను చేశాయి. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం డిఎంకెకు సేవలందించడంతో సునీల్ బెంగళూరుకు వెళ్లిపోయారు. 2021లో నాటి సిఎం పళనిస్వామి కోరిక మేరకు అన్నాడిఎంకెకు పని చేశారు.

గత ఏడాది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికి ఆ పార్టీలో ఎన్నికల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సునీల్ కాంగ్రెస్‌తో జట్టు కట్టే విషయం తెలిసి కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై ఆయనను బిజెపిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సునీల్ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరే నాటికి పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. రాహుల్, ప్రియాంకా గాంధీ మద్దతుతో సునీల్ ఓ వ్యూహకర్తల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా4,080 కిలోమీటర్ల మేర నిర్వహించిన భారత్ జోడో యాత్రలో ఆయన వ్యూహం ఉంది. ఇక సునీల్ కనుగోలుకున్న పెద్ద బలం ఆయన ఎక్కడ పని చేసినా ఆ పార్టీలోని నేతలతో బలమైన సాన్నిహిత్యాన్ని పెంచుకోవడమేనని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతారు. కర్నాటకలో కూడా ఆయన అదే వ్యూహాన్ని అమలు చేశారు.

రాష్ట్రంలో రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీని ఒక్కటి చేసేందుకు ప్రయత్నించి అందులో విజయంసాధించారు. డికె శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పని చేశారు. చివరికి అమూల్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, రాష్ట్రప్రభుత్వంలో అవినీతిపై జరిగిన ప్రచారం.. ఇలా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలోనూ సునీల్ పాత్ర ఉంది. చివరికి అభ్యర్థుల ఎంపికలోనూ సునీల్ బృందం సర్వే సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్లు ఇచ్చింది. కర్నాటకలో బిజెపిని అడ్డుకోవడానికి రోజులో 20 గంటలు శ్రమించాల్సి వచ్చిందని సనీల్ కనుగోలు ఓ ఆంగ్లపత్కికు ఇచ్చిన ఓ ఇంటర్వూలో చెప్పారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది రాజస్థాన్, చత్తీస్‌గఢ్ సహా వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీకోసం ఆయన పని చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News