Friday, December 20, 2024

మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

- Advertisement -
- Advertisement -

మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. అవిశ్వాసంతో ఖాళీ అయిన మున్సిపల్ చైర్మన్ పదవికి సోమవారం ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీవో అమరేందర్ ఎన్నిక నిర్వహించారు. క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ 10 మంది కౌన్సిలర్లు 11గంటలకు నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. నూతన చైర్మన్ గా 11వ వార్డ్ కౌన్సిలర్ గుర్రం కవితలక్ష్మీ నర్సింహారెడ్డిని బీఆర్ఎస్ 1వ వార్డ్ కౌన్సిలర్ పురుగుల వెంకన్న ప్రతిపాదించగా, వైస్ ఛైర్మన్, 8వ వార్డు కౌన్సిలర్ బొల్లెపల్లి వెంకటయ్య బలపర్చడంతో కౌన్సిలర్లు లెంకల సుజాత (3వ వార్డు), వనం స్వామి (6వ వార్డు), దబ్బెటి విజయ (9వ వార్డు), కూరెళ్ల కుమారస్వామి (12వ వార్డు), కాంగ్రెస్ కౌన్సిలర్లు కారుపోతుల శిరీష (2వ వార్డు), ఎర్రబెల్లి మల్లమ్మ (4వ వార్డు), మలిపెద్ది రజిత (5వ వార్డు) చేతులెత్తి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ అమరేందర్ ప్రకటించారు.

అనంతరం నూతన చైర్మన్ కవితతో ప్రిసైడింగ్ ఆఫీసర్ అమరేందర్ ప్రమాణస్వీకారం చేయించారు. 12 మంది కౌన్సిలర్లు ఉండగా ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి భర్త మేఘారెడ్డి ఒంటెద్దు పోకడలను సహించలేక బీఆర్ఎస్ వైస్ చైర్మన్ తో సహా ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేసి నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి జనవరి 20న అవిశ్వాసం పెట్టారు. ఫిబ్రవరి 9న చైర్ పర్సన్ సావిత్రిమేఘారెడ్డిపై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా వైస్ చైర్మన్ వెంకటయ్యతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరుగురు, కాంగ్రెస్ కౌన్సిలర్లు నలుగురు కలిపి మొత్తం 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గి చైర్ పర్సన్ సావిత్రిమేఘారెడ్డి పదవి కోల్పోయారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహశీల్దార్ డి.రాంప్రసాద్ పాల్గొన్నారు.

పోలీసు బందోబస్తు
చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి, డి.నాగరాజు, నాగరాజు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ 11వ కౌన్సిలర్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి ఎన్నిక కావడంతో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నూతన చైర్మన్ కవితలక్ష్మీనర్సింహారెడ్డిని కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

కౌన్సిలర్లందర్నీ కలుపుకొని పనిచేస్తా: చైర్మన్ కవితాలక్ష్మీనర్సింహారెడ్డి
కౌన్సిలర్లందర్నీ కలుపుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన చైర్మన్ కవితలక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ చైర్మన్ ఆ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఎవరిని లెక్క చేయకుండా నియంతృత్వంగా వ్యవహరించారని, వార్డుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ కౌన్సిలర్లే చైర్మన్ ను వ్యతిరేకించి అవిశ్వాసం పెట్టడంతో మున్సిపాలిటీ అభివృద్ధికి తాము ముందుకు రాక తప్పలేదన్నారు. రూ.కోట్ల నిధులు ఖర్చయినా అభివృద్ధి పడకేసిందని, త్వరలోనే గాడిన పెడతామన్నారు. ఈనెల 9న విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News