భోపాల్: తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధించబోదని, అయితే గూండాలను, విధ్వంసకారులను విడిచిపెట్టబోదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ స్పష్టం చేశారు. బిజెపి పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం నాడిక్కడ దిగ్విజయ సింగ్ విలేకరులతోమాట్లాడుతూ గూండాలు, సంఘ విద్రోహక శక్తుల సమూహమే బజరంగ్ దళ్ అని ఆరోపించారు. ఈ దేశం అందరిదని, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ దేశాన్ని చీల్చడం ఆపాలని ఆయన హితవు పలికారు. దేశంలో శాంతిని నెలకొల్పగలిగితే దశాభివృద్ధికి అది దోహదపడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తుందా అని ప్రశ్నించగా తమ పార్టీ నిషేధించబోదని చెప్పారు. బజరంగ్ దళ్‌లో కొందరు మంచి వ్యక్తులు ఉండవచ్చని, అయితే గూండాలను, అల్లర్లకు పాల్పడేవారిని మాత్రం విడిచిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.