Wednesday, January 22, 2025

కాంగ్రెస్ 40 సీట్లయినా గెలవాలి: రాజ్యసభలో మోదీ ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ నుంచి సవాల్ చేశారని మోదీ చెబుతూ కాంగ్రెస్ కనీసం 40 సీట్లయినా గెలవాలని కోరుకుంటున్నానని వ్యంగ్యంగా అన్నారు. ‘రానున్న లోక్ సభ ఎన్నికల్లో మాకు 400 సీట్లు వస్తాయని ఖర్గే అన్నారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఆయన అంచనా ఖచ్చితంగా నిజమవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని రాజ్యసభలో బుధవారం సుదీర్ఘంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నెహ్రూ కాలం నుంచి ఆ పార్టీ ఎన్నో అవకతవకలకు పాల్పడిందన్నారు. అంబేద్కర్ కు సైతం భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేతలు అనుకోలేదనీ, కానీ తమ కుటుంబ సభ్యులకు మాత్రం ఇచ్చుకున్నారని విమర్శించారు. చూస్తుండగానే కాంగ్రెస్ పతనమైపోయిందని చెబుతూ, ఆ పార్టీ పతనం తనకు ఆనందాన్ని ఇవ్వదన్నారు. వికసిత భారత్ కోసం మోదీ 3.0 అవసరమన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూడబోతున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందుతుందని, భారత్ ను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ తీరు కూడా మారుతుందన్నారు.

అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మోదీ విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాత్రికి రాత్రే గద్దె దించిన ఘనత ఆ పార్టీదన్నారు. యుపిఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ అడుగంటిందని, పత్రికాస్వేచ్ఛను కాలరాశారని అన్నారు. ఆ పార్టీ ఏలుబడిలోనే దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని చెప్పారు.

ఆదివాసీలు, దళితులు అంటే కాంగ్రెస్ కు గిట్టదన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకి అంటూ ఒకప్పుడు ముఖ్యమంత్రులను ఉద్దేశించి నెహ్రూ రాసిన లేఖలోని కొన్ని భాగాలను చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకి అని, వారికి రిజర్వేషన్లు ఇస్తే ఉద్యోగులలో నైపుణ్యం దెబ్బతింటుందని నెహ్రూ పేర్కొన్నారని చెప్పారు. ఈ లేఖ రికార్డుల్లో ఉందన్నారు. అంబేద్కర్ లేకపోతే రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు. తమ ప్రభుత్వం ఓ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యమిచ్చామన్నారు. పదేళ్ల క్రితం 120 ఏకలవ్య స్కూళ్లు ఉంటే, ఆ సంఖ్య ఇప్పుడు 400కి పెరిగిందన్నారు. దేశంలో రెండు ట్రైబల్ సెంట్రల్ యూనివర్శిటీలు ఉన్నాయని చెప్పారు.

తమ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేర్చిందని మోదీ చెప్పారు. మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నామన్నారు. బానిసత్వపు గుర్తులను చెరిపేసే పనిలో ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన భూభాగాలను శత్రువులకు అప్పగించిందని, సైనిక ఆధునికీకరణను సైతం నిలిపివేసిందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ భద్రత గురించి పాఠాలు చెబుతోందని ఎద్దేవా చేశారు.

దేశం అబివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అబివృద్ధి చెందుతాయని మోదీ అన్నారు. ‘నా దేశం అంటే ఒక్క ఢిల్లీయే కాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్నీ నావే. ఓ రాష్ట్రంలో సంక్షోభం వస్తే దాని ప్రభావం దేశమంతటా ఉంటుంది’ అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారంచేస్తోందనీ, బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హెచ్ఏఎల్, ఎయిర్ ఇండియాలను దెబ్బతీసిందెవరు? మీ హయాంలో ఎల్ఐసీ ఎక్కడుంది, ఇప్పుడెక్కడుంది?’ అని మోదీ ప్రశ్నించారు.  పీఎస్ యులపై మదుపరుల విశ్వాసం పెరిగిందని, ఈ పదేళ్లలో పిఎస్ యుల విలువ 9.5 లక్షల కోట్లనుంచి 17 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనేది ఒక నినాదం కాదనీ, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధాని చెప్పారు.

‘కొన్ని రాష్ట్రాల్లో మా రాష్ట్రం, మా టాక్స్ అంటున్నారు. ఇదెక్కడి వితండవాదం? నది మా రాష్ట్రంలోంచి ప్రవహిస్తోంది కాబట్టి నీళ్లన్నీ మాకే అంటే ఎలా? మా రాష్ట్రంలో బొగ్గు ఉంది కాబట్టి మేమే వాడుకుంటాం అంటే కుదురుతుందా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయనీ, కొన్ని పేద రాష్ట్రాలకు మరిన్ని ఎక్కువ నిధులు అవసరమవుతాయని చెబుతూ నిధుల కేటాయింపులో సంకుచితంగా ఉండమనీ, పారదర్శకంగా ఉంటామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News