Monday, December 23, 2024

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

తీరు మారని కాంగ్రెస్
వరంగల్ కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు
ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవం రసాభాస
అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు
వరంగల్: కాంగ్రెస్ తీరు మారడం లేదు. వర్గ విభేదాలకు పుల్‌స్టాప్ పడటం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాటకు దిగారు.

వరంగల్ జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గొడవ చోటు చేసుకుంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఓ నేతను వేదికపైకి పిలిచే సమయంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేదికపైకి వెళ్లే సమయంలో ఓ నేతను కులం పేరుతో ప్రత్యర్థి వర్గానికి చెందిన మరొకరు దూషించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగానే గొడవ జరిగినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వరంగల్ డిసిసి అధ్యక్ష పదవిని కొండా మురళి, సురేఖ దంపతులు తమ వర్గానికి చెందిన వారికే కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఎర్రబెల్లి స్వర్ణను ఎంపిక చేసి అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించింది. ఈ విషయంపై తమకు సహకరించాలని కొండా మురళీ, సురేఖ దంపతులను ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు కలిసి కోరినట్లు స్వర్ణ వర్గీయులు చెబుతున్న మాట. ఇందుకు కొండా దంపతులు కూడా అంగీకరించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు. దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ కొండా దంపతుల ఇంటికి వెళ్లి కలవ లేదని, ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పిలవలేదని కొండా వర్గీయులు ఆందోళనకు దిగినట్లు మరో వర్గం వారు చెబుతున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది కాస్త గొడవకు దారి తీసిందని వెల్లడిస్తున్నారు. ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో కావాలనే కొందరు గొడవకు దిగినట్లు మరోవర్గం వారు ఆరోపిస్తున్నారు. ఇష్టారీతిగా కొట్టారని చెబుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్త రసాభాసగా మారడంతో ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వరరావు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. గొడవకు దిగిన కార్యకర్తల అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వరంగల్ అధ్యక్షురాలు, పిసిసి సభ్యులు సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకోవడం, చొక్కాలు చింపుకుని, చెప్పులతో కొట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News