Tuesday, February 4, 2025

సామేల్‌తో ఇక తెగదెంపుల్!

- Advertisement -
- Advertisement -

తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ పై కాంగ్రెస్ కేడర్ తిరుగుబాటు

మోత్కూరులో నియోజకవర్గ అసమ్మతి నేతల భారీ సమావేశం
9 మండలాల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
ఎంపీ చామలతో సమన్వయ కమిటీ వేయాలని నాయకుల డిమాండ్
కార్యకర్తలకు అండగా ఉంటా: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్

మన తెలంగాణ/మోత్కూరు: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పై కాంగ్రెస్ అసమ్మతి నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇంత కాలం అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బహిర్గతం కావడంతో నాయకులంతా ఎమ్మెల్యేపై గళమెత్తారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి సామేల్ పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన లీడర్లకే ప్రాధాన్యతనిస్తూ, వారినే వెంటేసుకుని తిరుగుతున్నారని, పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎల్ ఎన్ గార్డెన్స్‌లో సోమవారం తుంగతుర్తి నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ మోత్కూరు మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది.

సమావేశానికి నియోజకవర్గంలోని 9 మండలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సమావేశానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్, యాదాద్రి, సూర్యాపేట డీసీసీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, ధరూరి యోగానందచార్యులు, రాష్ట్ర నాయకులు వల్లంభట్ల పూర్ణచందర్ రావు, నారగోని అంజయ్య, పర్రెపాటి యుగంధర్, కాసోజు శంకరమ్మ, గూడెపు నాగరాజు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహర్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్, బ్లాక్ కాంగ్రెస్ తుంగతుర్తి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, అర్వపల్లి మండల అధ్యక్షుడు సత్యం, అడ్డగూడూరు వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, మహిళా అధ్యక్షురాలు అన్నెపు పద్మ తదితర నాయకులంతా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ పని చెప్పినా చేయడం లేదని, దగ్గరకు కూడా రానివ్వడం లేదని, సీఎం నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.10 కోట్లు ఇస్తే అందులో రూ.90 లక్షలు తన కొడుక్కే కాంట్రాక్ట్ ఇప్పించాడని, మిగతా ఫండ్‌లో 20శాతం పర్సంటేజీలతో బీఆర్‌ఎస్ కాంట్రాక్టర్లకే పనులు ఇచ్చారని ఆరోపించారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలను మెంబర్లుగా పెట్టారని, ఎమ్మెల్యే వెంట ఉన్న దొంగలకే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నారని, మీటింగ్ కు వస్తే ఇండ్లు, రేషన్ కార్డులు రావని బెదిరింపులకు దిగుతున్నారని, వంద ఎకరాల భూమి, వంద కోట్ల సంపాదనే ధ్యేయంగా ఎమ్మెల్యే పని చేస్తున్నాడని ఆరోపించారు. కార్యకర్తలు, ప్రజల కోసం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వేల ఎకరాల భూమిని దానం చేశారని, అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే వంద ఎకరాలపైనే భూమి కొన్న ఎమ్మెల్యే సామేల్ పార్టీ కోసం పని చేస్తున్నారా లేక ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారా అన్నది తేలిపోయిందన్నారు. పార్టీ అధిష్ఠానం కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుని అన్యాయం జరగకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ వేయాలని కోరారు.

కార్యకర్తలకు అండగా ఉంటా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్

పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ హెచ్చరించారు. కాంగ్రెస్‌లో గ్రామశాఖలో గెలవనోళ్లు పైకొచ్చి కూర్చుంటే పరిస్థితి గిట్లనే ఉంటుందని ఎమ్మెల్యే సామేల్ నుద్ధేశించి అన్నారు. ఎమ్మెల్యే కొడుకులొస్తరో, ఎమ్మెల్యే ఎవర్ని పెట్టినా సరే యూత్ కాంగ్రెస్ నుంచి గెలిచిన నాయకుల్లో ఒకరిపై గెలిచి చూపించాలని ఎమ్మెల్యే సామేల్ కు సవాల్ చేశారు. కార్యకర్తల కష్టం ఫలితమే తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేను 50 వేల ఓట్లతో గెలిపించిన కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలన్నారు. పార్టీ కోసం పని చేసిన లీడర్ సోమిరెడ్డి జిల్లా ఉపాధ్యక్ష పదవిస్తే నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఇలా ఇస్తారంటే..నియోజకవర్గం మాదని..ప్రాణాలు మావని, వచ్చి కబ్జా చేస్తామంటే చూస్తూ ఎలా ఊరుకుంటామన్నారు.

మీటింగ్ కు పోతే ఇండ్లు, రేషన్ కార్డులు రావని బెదిరిస్తున్నారని, ఎవడబ్బ సొమ్మని, రేవంతన్న పోరాటం చేస్తే ప్రభుత్వం వచ్చిందన్నారు. మా కార్యకర్తలు పంపిన లిస్టే ఫైనల్ అని, వారికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత మాదేనన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికే అధిక ఫండ్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. తుంగతుర్తిలో 15 ఏండ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా మీకు ఎలాంటి ఫరక్ పడలేదని, ఇప్పుడు ఏమైతుందని, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను టికెట్లు ఇప్పించి గెలిపిస్తానన్నారు. కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడితే వారి ఉద్యోగాలు ఊడగొడతానని హెచ్చరించారు. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తలు బాధలు పడితే సహించమని, ఇప్పటి నుంచి ప్రతి మండలం తిరుగుతూ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాదన్నారు.

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది: డీసీసీ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి

డీసీసీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 40 ఏండ్లుగా పని చేస్తున్నానని, ముశిపట్ల గ్రామశాఖ అధ్యక్షునిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, కాంగ్రెస్ లేని ఊరులో పార్టీని పటిష్టం చేసి నాలుగుసార్లు సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెలిపించానన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా అండగా నిలిచామన్నారు. ఇన్నేండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనకు పార్టీ పదవి ఇస్తే ఓర్వడం లేదని వాపోయారు.

పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రావని ఎవరు బెదిరించినా లెక్క చేయవద్దని, మంత్రి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఉన్నారని, వారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకే టికెట్లు వస్తాయని, ఆర్థికంగా సాయం చేసి వారిని గెలిపించుకుంటామన్నారు.
ఉద్యమకారున్ని అని చెప్పుకునే అర్హత ఎమ్మెల్యేకు లేదు

శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ

తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న తన కొడుకు శ్రీకాంత్ చారి వర్థంతి, జయంతికి రాకుండా, విగ్రహానికి పూలమాల వేయని ఎమ్మెల్యే సామేల్ కు ఉద్యమకారున్ని అని చెప్పుకునే అర్హత లేదని శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మ అన్నారు. తాను పార్టీలో చేరతానని ఎమ్మెల్యేను రమ్మంటే రాలేదని, మంత్రి, సీఎం వద్దకు పోదామంటే వాళ్లెవరని అన్నాడని, శ్రీకాంత్ చారి వర్థంతికి ఎమ్మెల్యేను రమ్మని పిలిస్తే నాకోసం చనిపోయాడా అని అవమానించాడని తెలిపారు. సామేల్ ముఖం చూసి కార్యకర్తలు, ప్రజలు ఓట్లు వేయలేదని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారన్నారు.

ఈ సమావేశంలో నాయకులు అంతటి నర్సయ్య, తండ సత్తయ్య, ఎండి.సమీర్, ఎలుగు యాదయ్య, కారుపోతుల వెంకన్న, చేడె అంబేద్కర్, బీసు శ్రీకాంత్, కేమిడి సైదులు, గూడెపు పాండు, మెంట నగేష్, మెంట సురేష్, ఆకుల రవి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాజేష్, మండలాల అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి, ఎరసానిపల్లి సందీప్, గణేష్, నజీర్, అశోక్, కొణతం నరేందర్ రెడ్డి, అవిశెట్టి కిరణ్, రాహుల్, అంకర్ల రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News