Friday, November 15, 2024

ట్విట్టర్‌లో వరి ‘వార్’

- Advertisement -
- Advertisement -

Congress's hypocritical love for farmers

తెలుగులో రాహుల్ గాంధీ ట్వీట్
తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి
రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టండి:
మంత్రి హరీశ్‌రావు ఘాటు స్పందన
ఒకే దేశం, ఒకే సేకరణ విధానం కోసం టిఆర్‌ఎస్ పోరాడుతోంది
రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ
: ఎంఎల్‌సి కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : వరిధాన్యం కొనుగోలు అంశంపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంగళవారం పెద్ద ఎత్తున ట్వీట్ వార్ నడిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలుగులో చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దీనిపై టిఆర్‌ఎస్ అగ్రనేతలు మంత్రి హరీశ్‌రావు, ఎంఎల్‌సి కవిత తదితర నేతలు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతీకగా పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం తనదైన శైలిలో స్పందించారు. టిఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. మీకు నిజంగానే తెలంగాణపైన ప్రేమ ఉంటే మా ఎంపీలతో కలిసి ఆందోళనలు చేయాలని మంత్రి హరీష్‌రావు ఘాటుగా రాహుల్‌గాంధీకి రిప్లై ఇచ్చారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి అంటూ రాహుల్‌గాంధీకి చురకలు వేశారు.

రైతులు ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పనిచేయండి అంటూ హరీశ్‌రావు సూచించారు. హరీశ్‌రావు చేసిన ట్వీట్ కాంగ్రెస్ నేతలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని రైతుల తరపున పోరాటం చేస్తానని వరిధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని విమర్శించారు. రైతల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ : ఎంఎల్‌సి కవిత

ధాన్యం సేకరణ అంశంలో కాంగ్రెస్ పార్టీ రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాహుల్ గాంధీ, మాణికం ఠాగూర్‌లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపి, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. తాను రాహుల్‌గాంధీలా నియోజకవర్గాన్ని వదిలి పారిపోలేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తనపై ట్వీట్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికంం ఠాగూర్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న దురహంకారం వల్లే పార్టీ రెండంకెల సీట్లకు చేరుకుందని ఎత్తిచూపారు. ఎన్నికల్లో రాహుల్‌గాంధీ మాదిరిగా తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయలేదని కూడా చెప్పారు. ’ఒక దేశం- ఒకే సేకరణ విధానం’ అని టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నట్లు కవిత వివరించారు.

దీనిపై రాహుల్‌గాంధీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ఎల్లప్పుడు రైతులతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వరిని సేకరించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. అంతకముందు రాహుల్‌గాంధీని ట్యాగ్ చేస్తూ కవిత చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎంపిలకు పార్లమెంట్ లోపలికి అనుమతి ఉండదని కవితను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు డోక్లా, బిర్యానీ రుచి గురించి మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2021 ఆగస్టులో సంతకం ఎవరు చేశారో మర్చిపోవద్దని చురకలంటించారు. తెలంగాణ రైతుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఎంఎల్‌సి కవిత ట్వీట్‌పై పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. టిఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం లేదని.. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇకపై ఎఫ్సీఐకి బాయిల్ రైస్ ఇవ్వబోమని గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. ఇది తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు అయ్యింది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్దమైంది. నెల రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి నిర్వహించిన ఆందోళనలకు ముగింపుగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News