ఎన్నికల బాండ్ల తీర్పుపై కాంగ్రెస్ స్పందన
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నోట్ల కన్నా ఓట్ల బలం గొప్పదన్న సత్యం ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందని కాంగ్రెస్ పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి మోసపూరిత ఆలోచనలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాల్పడదన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మాటలను ఆలకించి ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఎన్నికలలో సమన్యాయం పరిఢవిల్లేలా చూడాలని బిజెఇకి హితవు చెప్పింది.
ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దీన్ని అపారదర్శక, అప్రజాస్వామికంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మోసపూరిత పథకాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగవిర్ధుమైన ఈ నల్లధనం మార్పిడి పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. బిజెపి కోశాగారాన్ని నింపడానికి మోడీ ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం(పిఎంఓ), ఆర్థిక మంత్రి కలసి ఆర్‌బిఐ, ఎన్నికల కమిషన్, పార్లమెంట్, ప్రతిపక్షం వంటి వ్యవస్థలను ఎలా ధ్వంసం చేశాయో తమకింకా గుర్తుందని ఖర్గే ఆరోపించారు.
ఈ పథకం కింద కొన్న బాండ్లలో 95 శాతం బిజెపికే ముట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా..కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అవంటింఇచే అవినీతి కార్యకలాపాలకు మరో నిదర్శనం నేడు ప్రజల ముందున్నదని అన్నారు. ముడుపులు, కమీషన్లు తీసుకునేందుకు మరో మార్గంగా ఎన్నికల బాండ్లను బిజెపి ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. నేటితో ఈ అవినీతికి కాలం చెల్లిందని ఆయన అన్నారు.