సమ్మర్ సీజన్‌లో ప్రధానంగా సూర్యుడి తీక్షణమైన వేడి, ధూళి కారణంగా కండ్లకలక ( conjunctivitis ) ఎక్కువగా వ్యాపించడం జరుగుతోంది. అలెర్జీ, వైరల్ కండ్లకలక ఈ సీజన్‌లో ఎక్కువగా ఉంటోంది. అలెర్జిక్, వైరల్ కండ్లకలక ఈ రెండు రకాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. కళ్లు ఎర్రబారడం, దురద , కళ్లు వాయడం వీటి లక్షణాలు. యువతలో వేడి, ధూళి వల్ల ఇవి సాధారణంగా కనిపిస్తాయి. ఇవి కాక కాంటాక్ట్ లెన్స్ ప్రేరిత కండ్లకలక కూడా కొన్ని కేసుల్లో కనిపిస్తోంది. ఈ కండ్లకలకను కాంటాక్ట్ లెన్స్ ఎక్యూట్ రెడ్ ఐ(contact acute red eye ) సిండ్రోమ్ అని పిలుస్తున్నారు.
థైరాయిడ్ ,డయాబెటిస్ వ్యాధులున్న వారికి విటమిన్ డి, బి 12 లోపించిన వారికి, కంప్యూటర్ స్క్రీన్‌పై అత్యధిక సమయం పనిచేసే వారికి కండ్లకలక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేత్రవైద్యులు చెబుతున్నారు. అయితే సమ్మర్ సీజన్ తీవ్ర దశలో ఉన్నందున అలెర్జిక్ కండ్లకలక కేసులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. 14 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే స్విమ్మింగ్ క్రీడల్లో నిమగ్నమై ఉంటారో నీటి కాలుష్యం లేదా క్లోరిన్ ఎక్కువగా కలిసిన నీటి వల్ల కండ్లకలక బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. సుదీర్ఘకాలం ఎండలోను, ధూళి వాతావరణం లోను గడిపే వారికి కండ్లకలక అంటుకొంటుంది. ఇవన్నీ కంటిపాపతో ప్రమేయం లేనివి అయినందున ఈ ఇన్‌ఫెక్షన్ గురించి అంత సీరియస్ అవ్వక్కర లేదు. కంటిపాప ప్రమేయం ఉన్నట్టయితే కంటి చూపు సమస్య ఏర్పడుతుంది.
వైరల్ కండ్లకలక నుంచి కోలుకోడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది. అలెర్జిక్ కండ్లకలక నుంచి పూర్తిగా కోలుకోవాలంటే మూడు వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కండ్లకలక సమస్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎంతో అత్యవసరం ఉంటే తప్ప మండుటెండలో బయటకు వెళ్లరాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పీక్ అవర్స్‌లో కంటికి వేడి తగల కుండా చూసుకోవాలి. వ్యక్తిగతమైన పరిశుభ్రత చాలా అవసరం. చేతులు నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చేతులతో కళ్లు రుద్దరాదు. పరిశుభ్రమైన చల్లని నీటితో తరచుగా కళ్లు శుభ్రం చేసుకుంటే ధూళి కణాలు తొలగిపోతాయి. అలర్జీ దురద రాదు. కండ్లకలక వచ్చినప్పుడు ఐ స్పెషలిస్ట్‌ను సంప్రదించకుండా కంటికి మందులు ఎక్కువగా వాడరాదు.
కండ్ల కలక సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి కండ్ల కలక ఉన్నవారు ఒంటరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాంటాక్టు లెన్సులు వాడుతున్నవారు వీలైనంతవరకు వాటిని ఈ సమ్మర్‌సీజన్‌లో వాడకుండా ఉండడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే కళ్లకు షేడ్స్ పెట్టుకుని వెళ్లండి. వాతావరణ మార్పుల కారణంగా కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా కళ్లు ఎర్రబడుతుంటాయి. ఎక్కువగా వానలు కురిసినా కండ్లకలక వంటి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కంటి గుడ్డు చుటూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనుక ఉండే పొరలను కంట్జైనా అంటారు. కంట్లో దుమ్ముధూళి, నీరు పడితే ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఏదైనా సరే కంటి విషయంలో స్వీయ వైద్యం పనికిరాదు.