Friday, December 20, 2024

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రిగా రెండో సారి కాన్రాడ్ కె. సంగ్మా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో సంగ్మాతో పాటు మరో 11 మంది ఎంఎల్‌ఏలతో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇద్దరు ఎంఎల్‌ఏలు ప్రిస్టోన్ టైసాంగ్, ఎన్. ధర్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, మరో తొమ్మిదిమంది ఎంఎల్‌ఏలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

షిల్లాంగ్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రమాణస్వీకారం వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి. నడ్డా,అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. మంత్రులలో ఎనిమిది మంది ఎన్‌పిపికి చెందినవారు, ఇద్దరు యుడిపికి చెందినవారు కాగా, బిజెపి, హెచ్‌ఎస్‌పిడిపి నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పిపి) ఎన్నికల్లో 59 స్థానాలలో 26 స్థానాలను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్‌పిపి, నాలుగు ఇతర పార్టీలు..యుడిపి, బిజెపి, పిడిఎఫ్,హెచ్‌ఎస్‌పిడిపి, ఇద్దరు స్వతంత్ర ఎంఎల్‌ఏలు సోమవారం మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండిఎ 2.0)గా ఏర్పడి, 2018లో ఏర్పాటు చేసినట్లు మరో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలు వేర్వేరుగానే పోటీచేసినప్పటికీ తర్వాత పొత్తు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఈ సంకీర్ణానికి 45 మంది ఎంఎల్‌ఏలు ఉన్నారు.

కాన్రాడ్ ఇదివరకటి లోక్‌సభ స్పీకర్ పి.ఎ.సంగ్మా కుమారుడు. పి.ఎ.సంగ్మా 2016లో కాలధర్మం చెందారు. ఇదిలావుండగా నాగాలాండ్‌లో ఇదే రోజున నీఫియు రియో(72) ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఎన్‌డిపిపి అనే ప్రాంతీయపార్టీ, బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. రియో ఇదివరలో 2003-08, 2008–13, 2014–2018, 2018–2023 వరకు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News