మనతెలంగాణ/హైదరాబాద్: వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. మంగళవారం ఎకనామిక్ కమిటీ అధ్వర్యంలో సహజ వనరులు, చెరువులు కుంటల రక్షణ, వాననీటి సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర వ్యవసాయం అన్న అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ ముఖ్యఅతిధిగా పాల్గొని నీటి వనరుల ప్రాధాన్యతను వివరించారు. చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైన ఉందన్నారు.
వర్షపు నీటిని వృధాపోనీయకుండా చెరువులు , కుంటలకు మళ్లించాలని , భూగర్భజల మట్టాలను పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్టి శ్రీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ ఉమ్మడి ఏపి పాలనలో రాష్ట్రంలోని చెరువులు కుంటల రక్షణను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటాయ్యాక ముఖ్యమంత్రికేసిఆర్ మిషన్ కాకతీయ పేరుతో అన్ని చెరువులను అభివృద్ది చేశారన్నారు. చిన్ననీటిపారుదల వ్యవస్థను ప్రభుత్వం పునర్‌నిర్మానం చేసి సాగునీటి రంగాన్ని పటిష్టపరిచిందన్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చెక్‌డ్యాంల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎకనమిక్ కమిటీ నేతలు డా. గంగాధర్‌రావు డా.తిలక్ , ఎంపి హరినాధ్‌రెడ్డి, డా,రాజ్‌కుమార్, రంగారెడ్డి మధులిక్ చౌదరి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.