Wednesday, January 22, 2025

ప్రజాస్వామ్య హత్య

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టు తీక్షణంగా దృష్టిపెట్టి ఇంత ఘాటుగా విమర్శించినంత వరకూ చండీగఢ్ మేయర్ ఎన్నికలో జరిగిన కుట్రను ఎవరూ అంతగా పట్టించుకొన్న జాడ లేదు. సాంకేతిక కారణాల వల్ల ఫలితం తారుమారు అయి ఉంటుందనే అభిప్రాయమే అంతటా కలిగి ఉంటుంది. బ్యాలట్ పత్రం మీద ఓటరు వేసిన గుర్తును పోలింగ్ అధికారే స్వయంగా చేత్తో చెరిపేసి ఫలితాన్ని తారుమారు చేసిన దృశ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వీడియోలో చూసి దిగ్భ్రాంతికి గురైంది. గుర్తు కింది వైపు గల ఓటు పత్రాలను వదిలేసి అది పైభాగాన ఉన్న చోట దానిని చేత్తో తెలివిగా చెరిపి వేస్తూ, తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని కెమెరా వైపు చూస్తుండడాన్ని కూడా న్యాయమూర్తులు కనిపెట్టారు. దానితో జస్టిస్ చం ద్రచూడ్ అగ్రహోదగ్రులయ్యారు. ప్రజాస్వామ్యం హత్యకు గురి అయిందన్నారు. దీనిని చూస్తూ ఊరుకోము అని ధర్మాసనం గర్జించింది. కంచే చేను మేయడం అంటే ఇదే. సవ్యంగా జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు కలిగిన ఆప్ అభ్యర్థి సునాయాసంగా గెలిచి ఉండేవారు. చండీగఢ్ కార్పొరేషన్ కౌన్సిల్‌లో 36 మంది సభ్యులున్నారు.

ఆప్, కాంగ్రెస్ ఉమ్మడి బలం 20 కాగా, బిజెపి సభ్యులు 12 మందే. ఓటింగ్ జరిగిన తర్వాత లెక్కింపు జరిపిన రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసీ ఆప్, -కాంగ్రెస్ తరపు 8 మంది ఓట్లు అస్పష్టంగా ఉన్నాయని చెప్పి అవి చెల్లవని ప్రకటించారు. చెల్లిన ఓట్లలో ఆప్ అభ్యర్థికి 12, బిజెపి అభ్యర్థికి 16 ఓట్లు పడ్డాయని నిర్ధారించి బలాబలాలను తారుమారు చేశారు. బిజెపి అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. ఇది అన్యాయమంటూ ఆప్ అభ్యర్థి హై కోర్టును ఆశ్రయిస్తే అది తలుపులు మూసివేయడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. సిజెఐ ధర్మాసనం వీడియోను క్షుణ్ణంగా పరిశీలించడంతో దొంగ, ప్రజాస్వామిక ద్రోహి బయటపడ్డాడు. అతడిని శిక్షించాలని ధర్మాసనం అభిప్రాయపడడం బాగుంది. ఈ మొత్తం ప్రజాస్వామిక హత్య కేసులో వెనుక నుండి బలంగా పని చేసిన ప్రచ్ఛన్న హస్తాలు లేకుండా ఉండవు. అవి విశేష అధికారాలు గలిగిన ఉన్నత స్థానాలలోని వారివే అయి ఉంటాయి. రిటర్నింగ్ ఆఫీసర్‌గా పని చేసిన మాసీ బిజెపిలో క్రియాశీల సభ్యుడు. దీనిని బట్టి కుట్ర మూలాలు ఎక్కడున్నాయో సరైన దర్యాప్తు చేస్తే తెలిసిపోతుంది. అందుచేత సరైన దర్యాప్తుకి ఆదేశించవలసిన అవసరం వుంది.

మేయర్ ఎన్నికలోనే ఇంత కుట్రకు పాల్పడినవారు ఇక ముందు ఏ ఎన్నికనైనా తారుమారు చేసేందుకు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. చెరిపేయడానికి, అస్పష్టంగా మార్చడానికి బొత్తిగా అవకాశం లేని విధంగా బ్యాలట్ పేపర్ పై ఓటు గుర్తు పడేలా తగిన కట్టుదిట్టాలు చేయవలసి ఉంది. గత పదేళ్ల బిజెపి పాలనలో ప్రజల తీర్పులను వమ్ము చేయించే పన్నాగాలు అనేకం విజయవంతంగా జరిగిపోయాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను వాడుకొని ప్రజల అభీష్ఠాన్ని కాలరాసిన సందర్భాలు చాలా వున్నాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని మహావికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూలదోసిన సందర్భంలో, అజిత్ పవార్ నాయకత్వంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని చీల్చి ఆయన వర్గం పదవుల కోసం పాలక కూటమిలో చేరినప్పుడూ ఆయా ఎంఎల్‌ఎల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ ఫిరాయింపుల చట్టం కింద దాఖలైన దరఖాస్తులపై నిర్ణయం తీసుకొనేలా సుప్రీం కోర్టు స్పీకర్‌పై ఒత్తిడి కల్పిస్తున్న తీరు ప్రశంసా పాత్రమైనది. చండీగఢ్‌లో జరిగిన దురంతానికి సుప్రీం కోర్టు ఆగ్రహించడాన్ని ప్రజాస్వామ్య ప్రియులందరూ తగిన చైతన్యంతో గుర్తించాలి.

ఎన్నికల ప్రక్రియ దోష రహితంగా, పవిత్రంగా జరుగుతూ ఉండడం ఒక్కటే ఈ దేశ స్థిరత్వానికి ప్రాణప్రదమైనదని ఈ కేసులో న్యాయమూర్తులు వెలిబుచ్చిన అభిప్రాయం వంద శాతం వాస్తవం. అయితే ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలతో ఓటర్లను తప్పుదోవ పట్టించి తీర్పు తమకు అనుకూలంగా మలచుకొనే దుష్టయత్నాలు రోజురోజుకీ పెరుగుతున్నాయిగాని తగ్గుముఖం పట్టడం లేదు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల పేదలు ఓటు విలువను తెలుసుకోలేకపోతున్న దుస్థితి ఇంకా ఉన్నది. ఎన్నికల సమయంలో బ్యానర్ల వంటివి కట్టి నీతులు వల్లించడం కాకుండా రాజ్యాంగపరమైన ప్రజాస్వామిక ఎరుకను ప్రజలలో కలిగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిరంతరం పని చేయాలి. సుప్రీం కోర్టు ఈ వైపుగా అవసరమైనంతగా ప్రజాస్వామిక సంస్థలను ప్రభావితం చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News