Sunday, December 22, 2024

మంత్రి హత్యకు ‘కుట్ర’

- Advertisement -
- Advertisement -

Conspiracy to assassinate Minister Srinivas Gowd

రూ.15కోట్ల సుపారీ

8మంది అరెస్టు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు పథకం
మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ఢిల్లీ నివాసంలో ఆశ్రయం పొందిన నిందితులు
జితేందర్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు, డికె అరుణ అనుచరులపై అనుమానాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్ సిపి సీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రి హత్య కుట్ర కేసుకు సంబంధించి వివరాలను బుధవారం రాత్రి సిపి తన కార్యాలయంలోని మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భం గా సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు రూ. 15 కోట్లకు సుపారీ ఇచ్చి హత్య చేయాలని ఫరూక్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకే ఎనిమిది మంది నిందితులను పేట్ బషీరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఈక్రమంలో మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన వారు మంత్రిని హత్య చేసేందుకు పథక రచన చేసినట్లు ఫరూక్ అనే వ్యక్తి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.

ఫరూక్ ఫిర్యాదు మేరకు ఈ కేసులో నిందితులైన యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో రఘును అరెస్ట్ చేశామని, ఢిల్లీలోని బిజెపి నేత, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి నివాసంలో నిందితుడు రఘును పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. విచారణలో భాగంగా రఘుకు ఆశ్రయం ఇచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వారిని పోలీసులు వదిలేశామన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కోణాన్ని సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు తెలిపామన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు నాగరాజుపై గతంలోనూ పలు హత్య కేసులు ఉన్నట్లు తేలిందన్నారు. వీరందరూ కలిసి మంత్రిని హత్యకు రూ. 15 కోట్లకు ఫరూక్‌కు సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నాది.

ఈ కేసులో ఫరూక్ అప్రూవర్‌గా మారడంలో మంత్రి హత్యలకు సంబంధించిన సుపారీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. మంత్రి హత్య కేసు విచారణలో తొలుత యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకు వచ్చాయని, దీంతో గత నెల 26న ముగ్గురుని అరెస్ట్ చేశామన్నారు. రాఘవేందర్ రాజు సహా మరికొందరు హత్యకు కుట్ర చేశారని నాగరాజు విచారణలో తెలియజేయడంతో రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, మధుసూధన్‌రాజు ఢిల్లీలో ఉన్నట్లు తేలిందన్నారు. ఈ కేసులో కీలక నిందితుని లొకేషన్ ట్రేస్ చేయగా ఢిల్లీలోని మాజీ ఎంపి జితేందర్ రెడ్డి నివాసంలో ఉన్నట్లు తేలిందన్నారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందం ఢిల్లీకి వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారన్నారు. అయితే నిందితునికి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి డ్రైవర్, పిఎ రాజు షెల్టర్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడు రాఘవేంద్ర రాజు నుంచి పిస్టల్ సీజ్ చేశామని, అదేవిధంగా రాఘవేంద్రరాజును పోలీసులు ప్రశ్నించగా మంత్రి శ్రీనివాస్ హత్యకు కట్ర చేసినట్లు తెలిసిందన్నారు. మంత్రి హత్యకు సంబంధించి రాఘవేందర్‌రాజు మొదట ఫరూఖ్‌తో కాంటాక్ట్ అయ్యాడని, మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాడన్నారు. ఈ సుపారీలో రాఘవేందర్‌రాజు, మధుసూధన్‌రాజు ప్రధాన ఫైనాన్షియర్లుగా ఉన్నట్లు తేలిందని, అనతికాలంలో వీరిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

ఇలా వెలుగు చూసింది 

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర విషయం వెలుగు చూసిన వివరాలను సిపి మీడియాకు వెల్లడించారు. ఈక్రమంలో గత నెల 23న ఫరూక్, హైదర్ అలీ సుచిత్ర వద్ద ఒక లాడ్జిలో ఉన్నారని, వీరు 25న ఇద్దరు బయటకు టీ తాగేందుకు వెళ్లినప్పుడు నాగరాజు, కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని వెంబడించి చంపడానికి ప్రయత్నించారన్నారు. తర్వాత ఫరూక్, హైదర్ అలీ తప్పించుకుని, 5 గంటల తర్వాత పేట్ బషీర్‌బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పేట్‌బషీర్‌బాద్ పోలీసులు నిందితులపై సెక్షన్ 307, 120బి, 115 రెడ్‌విత్ 34 ఐపిసి, సెక్షన్ 25 ఎబి ఆరమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో పలు విషయాలు వెలుగు చూశాయన్నారు. విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అనే ముగ్గురు మహబూబ్‌నగర్ నుంచి వచ్చి కొంపల్లి ఏరియాలోని సుచిత్రలో వీరిని వెంబడించి దాడికి చేసేందుకు యత్నించారని తేలిందన్నారు.

ఇద్దరు తప్పించుకున్న తర్వాత ముగ్గురు అదే ప్రాంతంలో కొన్ని లాడ్జీల్లో వెతికారన్నారు. ఈ నేపథ్యంలో వీరిని గత నెల 26న అరెస్ట్ చేసి 27న జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. నాగరాజు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో రాఘవేంద్ర రాజు, కొందరితో కలిసి మంత్రి హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. ఆ తర్వాత విచారణ జరుపగా రాఘవేందర్ రాజు, మున్నూర్ రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే, వీరికి గురించి సమాచారం లేకపోవడంతో వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి సర్వెంట్ క్వార్టర్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చామని సిపి తెలిపారు.

విచారణలో ఆసక్తికర విషయాలు ః

ఒక కేసు విచారిస్తున్న సందర్భంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కేసు వెలుగులోకి వచ్చిందని సిపి తెలిపారు. మంత్రి హత్య కేసులోని నిందితులు రాఘవేందర్ రాజు, రవి, మధుసూదన్, అమరేందర్ కలిసి మహబూబ్‌నగర్ నుంచి వైజాగ్ వెళ్లి అక్కడి ఢిల్లీకి వెళ్లి షెల్టర్ తీసుకున్నారన్నారు. వీరికి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి డ్రైవర్,పిఎ రాజు అని విచారణలో తేలిందన్నారు. వీళ్లందరిని సర్వెంట్ క్వార్టర్స్‌లో నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చామన్నారు. వారిని ప్రశ్నించడంతో మంత్రి హత్యకు సంబంధించిన కుట్ర కేసు వెలుగులోకి వచ్చిందన్నారు

పిస్టల్,బుల్లెట్ల స్వాధీనం 

మంత్రి హత్యకు కుట్ర పన్నిన నిందితుల నుంచి ఆయుధాలను రికవరీ చేశామని సిపి తెలిపారు. ఈక్రమంలో రాఘవేందర్ రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్, దుండిగల్ ఫారెస్ట్ ఏరియాలో 6 రౌండ్స్ రివాల్వర్ రాజు నుంచి రికవరీ చేసిన అనంతరం నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

ఫరూక్‌తో పరిచయం 

మంత్రి హత్య కేసులో కీలక నిందితుడు రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా తాను మొదట ఫరూక్‌ను కలిసినట్లు తెలిపాడు. ఫరూక్ కూడా నేర చరిత్ర ఉందని, తాము మంత్రిని హత్య చేయాలని పథకం వేశామని, ఆ పని నువ్వు చేసినా సరే.. వేరే ఎవరినా కలిపిస్తే వారితో చేయిస్తామని ప్రణాళిక వేశారన్నారు. ఈ హత్య కోసం రూ.15కోట్ల వరకు సుపారీ ఇవ్వచూపారని ఫరూక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని, ముఖ్యంగాఈ కుట్రలో రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేందర్ రాజు, మధుసూదన్, షెల్టర్ ఇచ్చిన వ్యక్తితో మరో ముగ్గురు భాగస్వాములైనట్లు విచారణలో తేలిందన్నారు. మంత్రి హత్య కేసుకు ప్రధాన సూత్రధారులు మధుసూదన్, అమరేందర్‌రాజులని, ఈ హత్య కోసం రూ.15కోట్లు సుపారీ ఇవ్వజూపినట్లు తేలడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని సిపి ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.

మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి పాత్రపై విచారణ 

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణ అనుచరుల పాత్రపైనా విచారణ జరుపుతున్నామని,విలేకరులు అడిగిన ప్రశ్నకు సిపి బదులిచ్చారు. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, పిఎ రాజు, డ్రైవర్ థాప, సౌత్ అవెన్యూలోనే షెల్టర్ ఇచ్చాడన్నారు. ఈ ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. ఆయుధాలను నాగరాజు యూపి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందని, పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నాగరాజు అరెస్టయిన తర్వాత హత్య కేసు, నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయని సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అదేవిధంగా మాజీ మంత్రి డికె అరుణ అనుచరులు పై కూడా అనుమానాలు ఉన్నాయని, అనతికాలంలో విచారణ చేపట్టి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News