మీడియా ముందుకు నిందితుడితో రైతు నాయకులు
న్యూఢిల్లీ: ఈనెల 26వ తేదీన తాము తలపెట్టిన ట్యాక్టర్ ర్యాలీ సందర్భంగా తమలో నలుగురిని చంపి అల్లర్లు సృష్టించడానికి ఒక కుట్ర జరిగిందని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన సాగిస్తున్న రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం రాత్రి సింఘూ సరిహద్దుల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ముసుగు ధరించిన ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో రైతులు తలపెటిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసుల వేషంలో చొరబడి రైతులపై లాఠీచార్జి చేయవలసిందిగా తనకు కొందరు వ్యక్తులు బాధ్యతను అప్పగించారని ఆ వ్యక్తి విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. సింఘూ సరిహద్దుల్లో నిరసన స్థలి వద్ద ఈ వ్యక్తిని తాము పట్టుకున్నామని రైతు నాయకులు చెప్పారు.
నిరసన స్థలి వద్ద వేదికపై ఉండే నలుగురు రైతు సంఘం నాయకులపై కాల్పులు జరిపి హతమార్చాలని పథకం వేసినట్లు ముఖానికి ముసుగు ధరించిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపితే వారు రైతు నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా అల్లర్లు సృష్టించాలన్నది తమ పథకమని అతను వెల్లడించాడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు విఘాతం కల్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైతు సంఘ నాయకుడు కుల్వంత్ సింగ్ సాంధు ఆరోపించారు. నిరసన స్థలి వద్ద అదుపులోకి తీసుకున్న వ్యక్తిని హర్యానా పోలీసులకు అప్పగించినట్లు రైతు సంఘ నాయకులు తెలిపారు.