ఇటావా(యుపి): అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను, కుమారుడిని చూసుకోవడానికి సెలవు లభించకపోవడంతో తన రెండేళ్ల కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ ఒక పోలీసు కానిస్టేబుల్ ఎస్‌పి ఆఫీసుకు వచ్చాడు. హృదయవిదారకమైన ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావాలో బుధవారం చోటుచేసుకుంది. తన భార్య, పిల్లవాడి బాగోగులు చూసుకునేదుకు అధికారులు సెలవు ఇవ్వకపోవడంతో సెలవు కోసం తాను నాటకాలు ఆడడం లేదని నిరూపించేందుకు బయద్‌పురా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సోను చౌదరి తన కుమారుఇ మృతదేహాన్ని పై అధికారులకు చూపించేందుకు ఎస్‌పి ఆపీసుకు చేరుకోవడం సంచలనం సృష్టించింది.
తన భార్య కవితకు గత వారం రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదని, సెలవు కోసం జనవరి 7న ఎస్‌పి ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నానని సోను చౌదరి తెలిపారు. సెలవు మంజూరు కాకపోవడంతో తాను డ్యూటీలో ఉన్న సమయంలో తన రెండేళ్ల కుమారుడు ఇంట్లో నుంచి పాకుతూ బయటకు వచ్చి నీటి గుంటలో పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే పిల్లవాడు మరణించాడని సోను చెప్పారు. కాగా..తన కుమారుడి మృతదేహంతో ఆఫీసుకు వచ్చిన సోను చౌదరిని ఉన్నతాధికారులు ఓదార్చారు.