Wednesday, January 22, 2025

ఉడుకెత్తిన ఉత్తర తెలంగాణ..వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతం ఉడుకెత్తిపోతోంది. వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కూల్ కూల్‌గా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలో నల్లగొండ జిల్లా దామర చర్లలో అత్యధికంగా 45.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోనూ 45.1డిగ్రీలు నమోదయ్యాయి.ఉత్తర తెలంగాణలోని చాల జిల్లాల్లో ఎండలు దడ పుట్టిస్తున్నాయి.వడగాడ్పులు వీస్తున్నాయి. లక్సేట్టిపేట అంకతివాడకు చెందిన కానిస్టేబుల్ ముత్తే సంతోష్ ఆదివారం వడదెబ్బకు గురై రాత్రి చనిపోయారు. ఉత్తర తెలంగాణలోని అధికశాతం ప్రాంతాల్లో ఉదయం 11గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేడిగాలులు వీస్తున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ వేడిగాలుల తీవ్రత తగ్గటం లేదు. రాష్ట్రంలోని 14జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది.

ఎండలకు దడిసి జనం ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రధాన పట్టణాలు నగరాల్లో సైతం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.జనం రాక వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇదివరకటిలా చాయ్, సిగరెట్ కోసం చీటికి మాటికి కార్యాలయం వదిలి బయటకు రావటం లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసిలు , కూలర్లకిందనే ఎక్కవగా విధినిర్వహణకు సమయం వెచ్చిస్తున్నారు. ఉదయం పదిగంటలకే ఆఫీసులకు చేరుకుంటున్న సిబ్బంది సాయంత్రం 5వరకూ ఆఫీస్ వదిలి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉంటోంది. దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నందున రాగల మూడు రోజుల్లో పొడివవాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాగల మూడు రోజలు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలగాన జిల్లాల్లో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది .మంగళవారం నుండి హైదరాబాద్ నగరంతోపాటుగా చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఎప్పుడూ కూల్‌కూల్‌గా ఉండే గ్రేటర్‌లో సైతం సోమవారం ఎండలు దంచి కొట్టాయి. ఖైరతాబాద్‌లో 40.8డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 40.7డిగ్రీలు, ముషీరాబాద్‌లో 39.9డిగ్రీలు నమోదయ్యాయి. నగరం పరిసరాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొంది. కీసరలో 40.5, శామీర్‌పేటలో 40.4, దుండిగల్‌లో 40.3, జీడిమెట్లలో 39.7 డిగ్రీలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News