Friday, March 21, 2025

విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మందుబాబు కారుతో వీరంగం..కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

తప్పతాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి కారుతో వీరంగం సృష్టించాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందగా మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ప్రాక్టీషనర్ కుమారుడు మద్యం సేవించి కారులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో గాంధారి హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదుట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రవికుమార్, సుభాష్‌ను కారు ఢీకొనడంతో రవికుమార్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కారు ఢీకొనడంతో రవికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కానిస్టేబుల్ సుభాష్ గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా రవికుమార్ 2007 సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు.

గతంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. పది నెలల క్రితం బదిలీపై గాంధారి పోలీస్‌స్టేషన్‌కి వచ్చాడు. గత పది సంవత్సరాలుగా దేవునిపల్లిలో కుటుంబంతో ఆయన నివసిస్తున్నారు. రవికుమార్‌కు భార్య వడ్ల సౌమ్య, రసజ్ఞ(8), రవిజ్ఞ(5) కూతుర్లు కాగా, 15 నెలల వయస్సున్న కుమారుడు రితీష్ చంద్రచారి ఉన్నాడు. రాత్రి విధుల్లోకి వెళ్లి శవమై ఇంటికి రావడంతో భార్య కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. చిన్న పిల్లలు ఉన్న రవికుమార్ కుటుంబ పరిస్థితిని చూసి పలువురు కన్నీటి పర్వతమయ్యారు. మృతిచెందిన కానిస్టేబుల్ రవికుమార్ మృతదేహానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నివాళుర్పించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. పోస్టుమార్టం తదితర వాటిని పూర్తయ్యే విధంగా చూడాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ ఇచ్చారు. రవికుమార్ కుటుంబానికి ఓదార్చి వారికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. పోలీస్ శాఖ ప్రభుత్వ తరుపున అన్ని రకాలుగా అదుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. పోలీస్‌శాఖ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News