Monday, January 20, 2025

చెరువులో దూకిన మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా జవహర్‌నగర్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడిన ఘటన గురువారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే భర్త చనిపోయి నలుగురు ఆడబిడ్డలతో జీవనం సాగిస్తున్న మమత(38) అనే మహిళ ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి తనకు చావే శరణ్యమని భావించి గురువారం మధ్యాహ్నం జవహర్‌నగర్ పరిధిలోని మల్కారం చెరువులో పడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

ఈ విషయం గమనించిన స్థానికులు 108కి ఫోన్ చేయడంతో పెట్రోలింగ్ డ్యూటిలో ఉన్న జవహర్‌నగర్ కానిస్టేబుల్ ఇంతియాజ్ వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకోని స్థానికుల సహాయంతో చెరువులోకి దిగి మహిళను రక్షించి చికిత్స నిమిత్తం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించగా,ప్రస్తుతం మమత ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.సకాలంలో స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ఇంతియాజ్‌ను పోలీస్ అధికారులతో పాటు స్థానికులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News